కాంగ్రెస్‌తో కలిసి నడుస్తా

Jan 2,2024 22:14 #press meet, #ys sharmila

-రెండు రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం

రేపు ఢిల్లీకి వెడుతున్నా : వైఎస్‌ షర్మిల

ప్రజాశక్తి- వేంపల్లె (వైఎస్‌ఆర్‌ జిల్లా), హైదరాబాద్‌ బ్యూరో :దేశంలో అతి పెద్ద సెక్యులర్‌ పార్టీ కాంగ్రెస్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షులు షర్మిల తెలిపారు. తన కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి వివాహం సందర్భంగా మొదటి శుభలేఖను ఆమె ఇడుపులపాయలోని మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి రాజశేఖర్‌రెడ్డి సమాధి ముందు ఉంచారు. కుటుంబసభ్యులతో కలిసి ప్రార్ధన నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తన తండ్రి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ మద్దతు ఇచ్చిందని, ఆ పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించిందని చెప్పారు. ఆ కృతజ్ఞతా భావంతో కాంగ్రెస్‌ పార్టీ తనను ఆహ్వానించిందని చెప్పారు. కాంగ్రెసుతో కలసి పనిచేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని అన్నారు. నేడు (బుధవారం) ఢిల్లీకి వెడుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో షర్మిల పాత్ర గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబిస్తూ ఒకటి,రెండు రోజుల్లో అందరి ప్రశ్నలకు, అన్ని ప్రశ్నలకు జవాబు దొరుకుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో షర్మిల తల్లి ైఎస్‌.విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి, కాబోయే కోడలు అట్లూరి ప్రియా, వియ్యంకులు తదితరులు పాల్గొన్నారు.

తెంగాణ నాయకులతో సమావేశం

అంతకుముందు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ నాయకులతో షర్మిల సమావేశమయ్యారు.. కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టిపి విలీనం, పార్టీ నాయకుల రాజకీయ భవిష్యత్తు తదితర అంశాలపై షర్మిల చర్చించారు. రాజకీయ భవిష్యత్తు కోసం నాయకులెవరూ ఆందోళనపడవద్దని, తగిన న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం మీడియాతో షర్మిల మాట్లాడుతూ అన్ని అంశాలపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. తనతో కలిసి నడుస్తానన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యలపై స్పందిస్తూ.., ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్‌ఆర్‌టిపి ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ షర్మిలకు ఎఐసిసిలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని చెప్పారు.

➡️