ప్రారంభమైన పిడుగురాళ్ల రోడ్డు పనులు

Mar 8,2024 23:49

ప్రజాశక్తి – పర్చూరు
వాడరేవు, పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రయాణికులకు మంచి రవాణా సౌకర్యం చేకూరనుంది. ప్రతిపాదనలు తీసుకున్న నిర్మాణ సంస్థ ఓడరేవు నుంచి చిలకలూరిపేట వరకు సుమారు 40కిలోమీటర్ల దూరాన్ని అభివృద్ధి చేస్తుంది. రెండు వరసల బీటి మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు సన్నాహాలు చేపట్టారు. రోడ్డు పనులకు రూ.825.76కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు అధికారులు వివరించారు. గత ఏడాది జూన్‌లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ, జాతీయ రహదారుల సంస్థ నేతృత్వంలో ఈపీసీ విధానంలో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. రాజేంద్ర సింగ్ బాబు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మాణ పనుల టెండర్‌ దక్కించుకుంది. కొత్త రోడ్డు నిర్మాణం కోసం జాతీయ రహదారి అధికారులు గుత్తేదారుకు సంబంధించిన భూమిని అప్పగించేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం రైతుల నుంచి సేకరించిన భూమికి నష్టపరిహారం చెల్లించేలా చొరవ చూపారు. ఈ పనులు రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో సాగింది. బాపట్ల జిల్లా పరిధిలో దాదాపు 100హెక్టార్లు, పల్నాడు జిల్లాలో అన్నంభట్ల వారిపాలెం నుంచి చిలకలూరిపేట వరకు మరో 40హెక్టార్ల భూసేకరణ చేపట్టారు. ఈ భూములను టెండర్‌ పొందిన సంస్థకు అప్పగించడంతో పనులు ప్రారంభించారు. హైవే సంస్థ ప్రతిపాదనలను గుత్తేదారు సిబ్బంది పరిశీలన పూర్తి చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. రెండేళ్లలో నిర్మాణం పూర్తిచేసి ఐదేళ్లపాటు రోడ్డు నిర్వహణ బాధ్యతలు కాంట్రాక్టు సంస్థ చేపట్టాల్సి ఉంది. అందులో భాగంగా పర్చూరు వై జంక్షన్ వద్ద అన్నంబొట్ల వారిపాలెం సమీపంలో కారంచేడు, పర్చూరు మార్గం వెంట ప్రోక్లైన్తో పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం రోడ్డు వెంట కాలవల్లో ఉన్న ముళ్లపొదలను తొలగించి భూమి చదును చేస్తున్నారు.

➡️