పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు

Apr 15,2024 08:23 #AP, #rising temperatures

రేపు 170 మండలాల్లో వడగాల్పులు!
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో సోమవారం 170 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని ఎపి విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 31 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీయనుండగా.. 139 మండలాల్లో అతి తీవ్ర స్థాయిలో ఈ వడగాడ్పులు ఉంటాయని పేర్కొంది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కొనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఏలూరు, ఎన్‌టిఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని మండలాల్లో ఈ వడగాడ్పుల ప్రభావం ఉండ నుంది. మంగళవారం కూడా 146 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని ఆ సంస్థ తెలిపింది. కాగా, ఆదివారం నంద్యాల జిల్లా గోస్పాడులో అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మన్యం జిల్లా నవగాం, విజయనగరం జిల్లా తుమ్మికాపల్లి, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 43.3 డిగ్రీల చొప్పున, వైఎస్‌ఆర్‌ జిల్లా సింహాద్రిపురం, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 42.4 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

➡️