హక్కులను వినియోగించుకోవాలి

Nov 23,2023 00:37

ప్రజాశక్తి – చీరాల
వినియోగదారుల హక్కులు ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని కన్స్యూమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి డి ఇమ్మానియేలు అన్నారు. వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ వినియోగదారులేనని, కొనుగోలు చేసే వస్తువులు, సేవల్లో లోపాలకు తగిన నష్టపరిహారం పొందే అవకాశం ఉందని అన్నారు. నేటి విద్యార్దులే రేపటి దేశ భవిష్యత్తని అన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, జంక్ ఫుడ్‌కు, కల్తీ ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎరువులు, విత్తనాల కొనుగోలు సమయంలో, వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పని సరిగా రశీదు తీసుకోవాలని సూచించారు. వస్తువులు కొనుగోలు సందర్భంలో తయారీ తేదీ, తుదిగడువు, తయారీ దారుని చిరునామా, నాణ్యత, బరువు తప్పనిసరిగా పరిశీలించాలని తెలిపారు. వినియోగదారుల హక్కులపట్ల అవగాహన కలిగి ఉండి ఇతరులుకు తెలియజేయాలని అన్నారు. వినియోగదారుల రక్షణకు సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రూపొందించిన గోడ పత్రికలను హెచ్‌ఎం ఎ వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు కె వెంకటేశ్వరరెడ్డి, వినియోగ భారతి సంస్థ జిల్లా అధ్యక్షులు ఎస్‌డి మతీన్, సభ్యులు పి రాఘవ పాల్గొన్నారు.

➡️