ఎక్కడికక్కడ ప్రతిఘటన

Dec 16,2023 09:13 #everywhere, #Resistance
  • అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టడాన్ని అడ్డుకున్న ప్రజలు
  • నిలదీతతో పలుచోట్ల వెనక్కి తగ్గిన అధికారులు

ప్రజాశక్తి- యంత్రాంగం : ప్రభుత్వం సమ్మెను పరిష్కరించాల్సిందిపోయి అంగన్‌వాడీ కేంద్రాలను అధికారులతో బలవంతంగా తెరిపించేందుకు శుక్రవారం కూడా ప్రయత్నించింది. అయితే, దాదాపు అన్ని జిల్లాలోనూ ఈ ప్రయత్నాలను ప్రజలు, అంగన్‌వాడీ కేంద్రాల లబ్ధిదారులు అడ్డుకున్నారు. దీంతో, ఆయా ప్రాంతాల్లో అధికారులు వెనక్కి తగ్గారు. అంగన్‌వాడీల సమ్మెకు ప్రజల మద్దతు పెరుగుతోంది. అంగన్‌వాడీలు నల్ల దుస్తులతో సమ్మె శిబిరాల్లో పాల్గొన్నారు. పలు జిల్లాలో ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలను పగులగొట్టడం పట్ల పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖ నగరంలోని జివిఎంసి 94వ వార్డు కృష్ణానగర్‌ అంగన్‌వాడీ కేంద్రం తాళాలు పగలగొట్టి స్టాకును తరలించేందుకు వచ్చిన సచివాలయ సిబ్బందిని స్థానికులు, లబ్ధిదారులు అడ్డుకున్నారు. అంగన్‌వాడీలు మూడు రోజులుగా సమ్మె చేస్తున్న సమయంలో వారు లేకుండా కేంద్రం తాళాలు పగలగొట్టడం సరికాదని తిరగబడ్డారు. దీంతో, సచివాలయ సిబ్బంది వెనుదిరిగారు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది పంచాయతీ పరిధిలో ఎనిమిది అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, పంచాయతీ ఇఒ లవరాజు, పలువురు సచివాలయ సిబ్బంది ఆయా కేంద్రాల వద్దకు వెళ్లి తెరిపించే ప్రయత్నం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల పిల్లల తల్లిదండ్రులు వారిని అడ్డుకున్నారు. బండిఆత్మకూరులో అంగన్‌వాడీ కేంద్రం తాళాలు పగులగొట్టేందుకు సచివాలయ అధికారులు ప్రయత్నించగా అంగన్‌వాడీలు అడ్డుకోవడంతో వారు వెనక్కి తగ్గారు. అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలం కట్రవాడ, పూజారి పాకలు, అద్దరి వీధిలోని అంగన్‌వాడీ సెంటర్ల తాళాలను సచివాలయ మహిళా పోలీసులు, వలంటీర్లు పగలగొడుతుండగా అంగన్‌వాడీలు అక్కడకు చేరుకొని అడ్డుకున్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లా నందిగామ 19వ వార్డు హనుమంతుపాలెం అంగన్‌వాడీ కేంద్రం తాళాలను పగులగొట్టేందుకు ప్రయత్నించిన సచివాలయ సిబ్బందిని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి కోట కల్యాణ్‌, స్థానికులు అడ్డుకొని నిలదీశారు. విజయవాడ 63వ డివిజన్‌ రాజీవ్‌ నగర్‌ వడ్డెర కాలనీ, సుందరయ్య నగర్లలోని నెంబరు 823 అంగన్‌వాడీ కేంద్రం, ఇతర కేంద్రాలను తాళాలు పగలకొట్టడాన్ని ఐద్వా, సిఐటియు, ప్రజా సంఘాల నాయకులు అడ్డుకున్నారు. సమ్మెను పరిష్కరించాలని కోరుతూ కాకినాడ రూరల్‌ మండలంలోని తూరంగి గ్రామంలో సచివాలయం వద్ద అంగన్‌వాడీ లబ్ధిదారులు ధర్నా చేశారు. విజయనగరంలో బాలాజీ మార్కెట్‌ పక్కన రెల్లివీధిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని తెరిచేందుకు సచివాలయ సిబ్బంది రావడంతో ఆ ప్రాంతవాసులు అడ్డుకున్నారు. మెంటాడ మండలంలో సచివాలయ సిబ్బంది అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహించలేమంటూ ఎంపిడిఒ వద్ద తేల్చి చెప్పారు. బాపట్లలో అక్బర్‌పేట అంగన్‌వాడీ కేంద్రం తాళాలు పగుల కొట్టడం పట్ల అధికారులతో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ మజుందార్‌, అంగన్‌వాడీలు నిలదీశారు. కాకినాడ జడ్‌పి సిఇఒ కార్యాలయం వద్ద ధర్నాలో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబిరాణి మాట్లాడుతూ సచివాలయం సిబ్బందికి జగన్‌ ప్రభుత్వం తాళాలు ఎలా పగలగొట్టాలో తర్ఫీదునిస్తూ అంగన్‌వాడీల సమ్మెను నిర్వీర్యం చేయడానికి పావులుగా వాడుతుందని విమర్శించారు. ఈ దుర్మార్గ చర్యలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపైనా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జడ్‌పి సిఇఒ ఎ.రమణారెడ్డి ధర్నావద్దకు వచ్చి అంగన్‌వాడీలతో మాట్లాడారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో సమ్మె శిబిరాన్ని, చిలకలూరిపేటలో శిబిరాన్ని యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ సందర్శించి మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాలు మా ఇళ్లు లాంటివని, ఇంటి తాళాన్ని ఇతరులు పగలగొటితే ఎలా కేసు పెడతామో అంగన్‌వాడీ కేంద్రాల తాళలు పగలుగొట్టిన ఘటనపైనా కేసు పెడతామని హెచ్చరించారు. చిలకలూరిపేటలో సమ్మె శిబిరాన్ని ఎపి కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ, యుటిఎఫ్‌, ఇతర ప్రజా సంఘాల నాయకులు సందర్శించి మద్దతు తెలపారు. అనంతపురంలో అంగన్‌వాడీలు భిక్షాటన చేశారు. సమస్యలు పరిష్కరిస్తారా? అడుక్కొని సెంటర్‌లు నిర్వహించమంటారా? అంటూ నినాదాలు చేశారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలో దీక్షా శిబిరం వద్ద గడ్డి తింటూ నిరసన తెలిపారు.

➡️