పీఠాపురంలోనే నివాసం -చేబ్రోలు బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ ప్రకటన

Mar 30,2024 23:33 #janasena pawan, #pitapuram, #speech

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి, పిఠాపురం :ఎన్నికలలో తనను గెలిపిస్తే పీఠాపురంలోనే నివాసం ఉంటానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల పర్యటన సందర్భంగా ఆయన తొలి రోజు గొల్లప్రోలు మండలం చేబ్రోలులో శనివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. పీఠాపురంలో తనను ఎలాగైనా ఓడించాలని వైసిపి ప్రయత్నిస్తోందని అన్నారు. ‘ చిత్తూరు జిల్లా నుంచి మిథున్‌ రెడ్డిని తీసుకువచ్చింది. మండలానికి ఒక కీలక నేతను పెట్టింది.’ అనిఅన్నారు. నా దగ్గర అంతగా శక్తి లేకపోయినా ఎందుకంత కక్ష పెట్టుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసిపి ఫ్యాన్‌ సౌండ్‌ ఎక్కువ, గాలి తక్కువ అని ఎద్దేవా చేశారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు తనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. 21 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్నా తనపై వైసిపి కక్ష కట్టిందన్నారు. వాళ్ల అక్రమాలను భవిష్యత్తులో ప్రశ్నిస్తానని భయపడుతుండడమే ఇందుకు కారణమన్నారు. గొల్లప్రోలులో ముంపు, చేబ్రోలులో పట్టు రైతులకు ఏమి చేశారో చెప్పాలని వైసిపి నేతలను ప్రశ్నించాలని అన్నారు, ఒక దళితుడిని చంపి డోర్‌ డెలివరీ చేసిన ఎంఎల్‌సికి వైసిపి అండగా వైసిపి ఉందని విమర్శించారు. కూటమికి ఓట్లు వేస్తే తాను జవాబుదారీతనంగా నిలబడతానని, సమస్యలపై ప్రశ్నిస్తానని హామీ ఇచ్చారు. వైసిపి వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డామన్నారు. సుద్ధగడ్డ ఆధునీకరణ జరగక రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రూ.175 కోట్లు నిధులు వచ్చినా ఎందుకు పనులు చేపట్టలేదని, గడిచిన ఐదేళ్లలో ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. తీర ప్రాంతం కోతకు గురవుతున్నా సరైన ప్రణాళికలు చేయలేకపోయారని విమర్శించారు. కోనపాపపేటలో రసాయన పరిశ్రమల వల్ల మత్స్యకారులకు ఉపాధిపోతున్నా అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదన్నారు. వైసిపి పాలనలో అవినీతి లేదని చెప్పుకుంటున్నారని, అలా అయితే అవినీతి నిరోధక శాఖ టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఎనిమిది లక్షల ఫిర్యాదులు ఎందుకు వెళ్లాయని ప్రశ్నించారు. కాకినాడ పోర్టులో డీజిల్‌, డ్రగ్స్‌ మాఫియా నడుస్తోందని, అక్రమ బియ్యం వ్యాపారులకు కాకినాడ పోర్టు అడ్డాగా మారిందని ఆరోపించారు. వర్మ తన కోసం పిఠాపురం అసెంబ్లీ సీటును త్యాగం చేశారని, ఆయన త్యాగాన్ని ఎప్పుడూ మర్చిపోలేనని, వర్మకు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తానని పవన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, టిడిపి నేత సుజరుకృష్ణ రంగారావు, జనసేన నేతలు బి.మహేందర్‌రెడ్డి, జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదరు శ్రీనివాస్‌, కొత్తపల్లి సుబ్బారాయుడు తదితరులు పాల్గోన్నారు.
నాలుగు గంటల ఆలస్యంగా సభ
నిరాశ చెందిన పార్టీ శ్రేణులు
సాయంత్రం నాలుగున్నర గంటలకు నిర్వహించాల్సిన పవన్‌ కల్యాణ్‌ సభ రాత్రి 8.30 గంటలకు కూడా ప్రారంభం కాలేదు. రోడ్డు షోకి అనుమతి లేకపోవడంతో పవన్‌ బస చేసిన ప్రాంతం నుండి చేబ్రోలుకు రావడం ఆలస్యం చేశారు. అనుమతులు వచ్చిన తర్వాత బయలుదేరారు. సుమారు నాలుగు గంటలు ఆలస్యం కావడంతో జనసేన శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి. సభ ప్రారంభానికి ముందే అనేకమంది వెనుదిరిగారు.

➡️