ప్రమాదంలో రిజర్వేషన్లు

Feb 19,2024 10:06 #BJP Govt, #reservations
Reservations at risk

దళితులకు అన్యాయం

డివైఎఫ్‌ఐ యువ దళిత సదస్సులో యుజిసి మాజీ ఛైర్మన్‌ సుఖదేవ్‌ థోరాట్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో రిజర్వేషన్లు ప్రమాదంలో పడ్డాయని, దళిత తరగతులకు అన్యాయం జరుగుతోందని యుజిసి మాజీ ఛైర్మన్‌ సుఖదేవ్‌ థోరాట్‌ విమర్శించారు. డివైఎఫ్‌ఐ అఖిల భారత కమిటీ ఆధ్వర్యాన దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై పంజాబ్‌లోని చండీగఢ్‌లో బాబా సోహన్‌ సింగ్‌ భక్న భవన్‌లో ఆదివారం నిర్వహించిన దళిత యువ జాతీయ సదస్సులో థోరాట్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో దళితులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. రిజర్వేషన్లు ప్రమాదంలో పడ్డాయని పేర్కొన్నారు. ఇటీవల యుజిసి ఎస్‌సి, ఎస్‌టి రిజర్వుడు పోస్టులు భర్తీకాకపోతే, వాటిని జనరల్‌ కేటగిరిలో కలిపివేయాలని నిర్ణయం తీసుకుందని విమర్శించారు. దీనిపై ప్రతిఘటన రావడంతో వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. మోడీ అనుసరిస్తున్న మనువాద చర్యలు దళితులకు నష్టం చేస్తాయని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం వంటి విధానాలతో దళిత విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, దీన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఉపాధి రంగంలో కూడా దళితులకు ఆశించిన అవకాశాలు లేవని అన్నారు. వీటన్నింటిని డివైఎఫ్‌ఐ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. డివైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎఎ రహీం, హిమాగరాజ్‌ భట్టాచార్య, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సహాయ కార్యదర్శి విక్రమ్‌ సింగ్‌ తదితరులు పాల్గొని మాట్లాడారు. మోడీ పాలనలో దళిత యువకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిందని, దళిత యువతలో అది మరింత పెరిగిందని అన్నారు. ఇప్పటికి అనేక రూపాల్లో దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని చెప్పారు. అనేక రాష్ట్రాల్లో భౌతిక దాడులు చేసి హత్యలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ప్రతి 18 నిమిషాలకు ఒక దాడి జరుగుతోందని పేర్కొన్నారు. ప్రతి వారానికి ఆరుగురు హత్యకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ముగ్గురు దళిత మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని అన్నారు. రోజుకు 27 చోట్ల దళితులపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. దళిత యువతకు డివైఎఫ్‌ఐ అండగా ఉంటుందని తెలిపారు. ప్రతి రాష్ట్రంలో టీం ఏర్పాటు చేయాలని కోరారు. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి చర్చల్లో పాల్గొన్న డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ.. దేశంలో మోడీ అధికారంలోకి వచ్చాక, మనువాదులు పెట్రేగి పోతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక రూపాల్లో దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు సర్వసాధారణంగా మారాయన్నారు. దళితులకు రక్షణగా ఉన్న చట్టాలను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. చదువు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దళిత యువతకు దొరకడం లేదని అన్నారు. మోడీ ప్రభుత్వాన్ని దళిత యువత ఓడించడంతోపాటు దళితుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేయాలని డివైఎఫ్‌ఐ అఖిల భారత ఉపాధ్యక్షులు జాక్‌ సీ థామస్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సదస్సు ఆమోదించింది. సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధులు రమణ, బాబు, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️