సమస్యల పరిష్కారం కోరుతూ వినతులు

Dec 6,2023 21:46 #Anganwadi Workers, #Dharna

– అంబేద్కర్‌ విగ్రహాలకు అంగన్‌వాడీల వినతి

ప్రజాశక్తి – యంత్రాంగం :తమకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, ఇతర సమస్యల పరిష్కారం డిమాండ్‌ చేస్తూ బుధవారం పలు జిల్లాల్లో అంబేద్కర్‌ విగ్రహాలకు అంగన్‌వాడీలు వినతిపత్రాలు అందజేశారు. ఎపి అంగన్‌ వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం చేపట్టారు. తమ పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోన్న వైసిపి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ నెల ఎనిమిది నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు పలువురు నాయకులు తెలిపారు.పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు ఐసిడిఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో అంబేద్కర్‌ విగ్రహాలకు సమస్యలతో కూడిన వినతిపత్రాలను అందజేశారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలోని ఎంపిడిఒ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. శ్రీకాకుళంలోని అంబేద్కర్‌ కూడలిలో నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. విశాఖ ఎల్‌ఐసి కార్యాలయం దరి అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, కాకినాడ జిల్లా పెద్దాపురం, జగ్గంపేట, కరపలో అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, బండాయికోడు తూము సెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రాలు అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని కామరాజుపేటలో, కడప, మైదుకూరులో మహాత్మాగాంధీ, అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేసి,నిరసన తెలిపారు. ఎన్‌టిఆర్‌ జిల్లా మైలవరం, నందిగామ, తిరువూరులో వినతిపత్రాలు అందజేశారు. కర్నూలు జిల్లా కోసిగి, ఆదోనిలో, నంద్యాల జిల్లాలో డోన్‌, చాగలమర్రి, ఆత్మకూరు, కొత్తపల్లి, నంద్యాలలో అంబేద్కర్‌ విగ్రహాలకు సమస్యలతో కూడిన వినతిపత్రాలను అంగన్‌వాడీలు అందజేశారు.

➡️