గణతంత్ర దినోత్సవం

Jan 26,2024 08:43 #jeevana, #Republic Day 2024

నేస్తాలూ,

ఈ రోజు మనం 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం.

అసలు ఈ రోజు ఎలా వచ్చిందో, దాని విశేషాలు ఏంటో తెలుసుకుందామా ?

             దాదాపు 200 ఏళ్ల పాటు బ్రిటీష్‌ వారు మన దేశాన్ని పాలించారు. వాళ్లను మన దేశం నుంచి పంపించేందుకు మన దేశ నాయకులు, ప్రజలూ ఎంతో పోరాటం చేశారు. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. చివరికి ఆగస్టు 15, 1947న మనకు స్వాతంత్య్రం వచ్చింది. అప్పటివరకూ మనదేశ పరిపాలన బ్రిటీష్‌ రాజ్యాంగం ప్రకారమే జరిగేది. స్వాతంత్య్రం వచ్చాక మన పాలన ఎలా ఉండాలో, పౌరులు ఎలా ఉండాలో ఒక విధానం తయారు చేసుకోవడం అవసరమైంది.

డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. 1947 ఆగస్టు 29న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటైంది. అనేక సవరణల అనంతరం 1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది. రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలంలో పూర్తి చేసిన మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది. 308 మంది సభ్యులు కీలక చర్చలు నిర్వహించిన రాజ్యాంగాన్ని ఇంగ్లీషు, హిందీ భాషల్లో చేతిరాతతో తయారుచేశారు. రాజ్యాంగం అసలు ప్రతులు రెండు మాత్రమే ఉంటాయి. అవి పాడవ్వకుండా ఉండేందుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్‌ కేసుల్లో పార్లమెంటు భవనంలో భద్రపరిచారు. వాటి నకలు ఫొటో కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి.

మన రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆరోజు మన దేశాన్ని ‘సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాం. ఆ రోజు నుంచి మన భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది. అందుకే ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రాష్ట్రపతి ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి.

దేశంలోని ప్రతి పాఠశాలలోనూ జాతీయ జెండా ఎగురవేసి వందనం చేస్తారు. ఈ సందర్భంగా భారతదేశ స్వాతంత్య్రానికి కృషి చేసిన అమరవీరుల త్యాగఫలాలను కొనియాడుతూ, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేస్తారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన బాలలకు ఈ రిపబ్లిక్‌ డే వేడుకల్లో ‘బాల పురస్కార్‌’ కూడా అందజేస్తారు.

➡️