జాతీయ స్మారక చిహ్నాల జాబితా నుండి 18 చిహ్నాల తొలగింపు

న్యూఢిల్లీ :    జాతీయ ప్రాముఖ్యత దృష్ట్యా రక్షిత స్మారక చిహ్నాల జాబితా నుండి 18 చిహ్నాలను తొలగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలోని పలు చిహ్నాలు ఈ జాబితాలో ఉన్నాయి.  తొలగించిన స్మారక చిహ్నాలలో అధిక శాతం ముస్లింలకు చెందినవి కావడం గమనార్హం.  ఈ నోటిఫికేషన్‌లపై రెండు నెలల్లోగా సలహాలు, అభ్యంతరాలు తెలియజేయాలని ప్రజలను కోరింది.

ప్రభుత్వం పురాతన చిహ్నాలు , పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం 1958 (ఎఎంఎఎస్‌ఆర్‌) సెక్షన్‌ 35ని ప్రభుత్వ అమలులోకి తీసుకువచ్చింది. ఈ చట్టం పురాతన, చారిత్రాత్మక స్మారక చిహ్నాలు లేదా పురావస్తు శాఖ ఆధీనంలోని ప్రదేశాలు, శిథిలాలను జాబితా నుండి తొలగించేందుకు అవకాశం కల్పిస్తుంది.

ఎఎంఎఎస్‌ఆర్‌ చట్టాన్ని 1958లో పార్లమెంటు ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం.. జాతీయ ప్రాముఖ్యత కలిగినదిగా ప్రకటించిన పురాతన స్మారక చిహ్నం రక్షిత స్మారక చిహ్నంగా గుర్తించబడుతుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎఎస్‌ఐ) ఈ స్మారక చిహ్నాల నిర్వహణ, అభివృద్ధితో పాటు మంచినీరు సదుపాయం, టాయిలెట్స్‌, సౌకర్యాలు, మార్గాలు, సాంస్కృతిక నోటీసు బోర్డులు, సంకేతాల ఏర్పాటు, వాహనాల పార్కింగ్‌, పర్యాటకులకు క్లోక్‌ రూమ్‌లు వంటి ఇతర బాధ్యతలను నిర్వర్తించాల్సి వుంటుంది.  అయితే ఎఎంఎఎస్‌ఆర్‌ చట్టంలోని సెక్షన్‌ 35 స్మారక చిహ్నాలను జాబితా నుండి తొలగించేందుకు అవకాశం కల్పిస్తుంది.

దేశంలోని రక్షిత స్మారక కట్టడాలతో అనేక సమస్యలు ఉన్నాయని రవాణా, పర్యాటకం, సంస్కృతి పై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ‘ఫంక్షనింగ్‌ ఆఫ్‌ ఆది ఆర్కియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’ పేరుతో గతేడాది వెల్లడించిన వెల్లడించిన 359వ నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఎఎస్‌ఐ 3,693 స్మారక చిహ్నాల పర్యవేక్షణ చేపడుతోందని, వాటిలో కనీసం నాలుగింట ఒకవంతు జాతీయ ప్రాముఖ్యత లేని చిన్న స్మారక చిహ్నాలు అని పేర్కొంది.

➡️