భీమా కోరేగావ్ స్ఫూర్తితో హక్కుల పోరాటం  

Jan 1,2024 16:46 #Dalit, #Kakinada, #Special Days
remember bhima koregon movement

ప్రజాశక్తి-కాకినాడ : భీమా కోరేగావ్ స్ఫూర్తితో తమ హక్కుల కోసం దళితులందరూ ఐక్యంగా పోరాడాలని దళిత సీనియర్ నాయకులు అయితా బత్తుల రామేశ్వరరావు, బుద్ధ విహార్ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ జి. భానుమతి, దళిత సీనియర్ నాయకులు వి. కృష్ణమూర్తి, కెవిపిఎస్ సీనియర్ నాయకులు ఎం రాజశేఖర్, జనచైతన్య నాయకులు పవన్ ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఇంద్ర పాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద భీమ కోరేగావ్ స్మారక స్థూపం వద్ద మృతవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ పీష్వా బ్రాహ్మణులపై మహార్‌ పోరాట యోధుల యుద్ధ విజయానికి చిహ్నమే భీమా కోరేగావ్‌ అని అన్నారు. 500 మంది మహర్‌ వీరులు 28 వేల మంది పీష్వా బ్రాహ్మణ సైన్యంతో మహారాష్ట్ర కోరే గావ్‌లోని భీమా నది వద్ద భీకర యుద్ధం చేసి 1818 జనవరి 1న విజయం సాధించారన్నారు. అపార సైనిక బలగం కలిగిన పీష్వా రాజ్యంతో యుద్ధం చేయలేని బ్రిటిష్‌ వాళ్లు తమతో కలిసి పోరాడాలని మహర్‌లను కోరారు. అప్పటి మహార్‌ నాయకుడు సిద్‌నాక్‌ పీష్వా సైన్యాధికారి బాపు గోఖలే వద్దకు వెళ్లి పశువుల కన్నా హీనంగా చూడబడుతున్న తమకు గౌరవంగా బతికే అవకాశం కల్పించాలని కోరారు.
వేల సంవత్సరాల బానిస సంకెళ్లు తెంచు కోవాలని ప్రతిన బూనిన ఐదు వందల మంది మహర్‌ సైన్యం, రెండు వందల మంది బ్రిటిష్‌ సైన్యంతో కలిసి 200  కిలోమీటర్లు నడిచి భీమా నది ఒడ్డుకు చేరుకున్నారన్నారు. 20 వేల మంది పదాతిదళం, 8 వేల మంది అశ్విక దళంతో కనుచూపుమేరలో కనిపిస్తున్న పీష్వా సైన్యాన్ని చూస్తే ఎవరికైనా వణుకు పుడుతుందన్నారు. కానీ బతికితే పోరాట వీరులుగా బతకాలనీ, లేదంటే హీనమైన బతుకులతో చావాలనీ నిర్ణయించుకున్న మహర్‌ సైన్యం పీష్వా సైన్యంతో యుద్ధానికి తలపడిందన్నారు. తిండి లేకుండా కాలినడకన వచ్చి కూడా మహర్‌ సైన్యం సింహాల్లాగా పీష్వా సైన్యాన్ని ఎదుర్కోవడాన్ని చూసిన బ్రిటిష్‌ లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ ఆశ్చర్యపోయారన్నారు. భీకర పోరాటంలో భీమా నది ఎర్రబడిందన్నారు. పీష్వా సైన్యం వెనక్కి తగ్గిందన్నారు. అమరులైన 12 మంది మహార్‌ సైనికులకు బ్రిటిష్‌ వారు స్మారక స్థూపం కట్టించడమే కాకుండా మహర్‌ సైనికులతో మహర్‌ రెజిమెంట్‌ ఏర్పాటు చేశారని ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కే.ఎస్ శ్రీనివాస్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కే. సింహాచలం, దళిత సంఘాల నాయకులు భయ్యా రాజేంద్రప్రసాద్, వి.వి సత్యనారాయణమూర్తి, బి.కామేశ్వరరావు, పి. వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️