బర్త్‌ సర్టిఫికెట్‌లోనూ మత కోణం

  • తల్లిదండ్రులిద్దరి మత వివరాలు విడివిడిగా పేర్కొనాల్సిందే!
  •  కేంద్ర హోంశాఖ ముసాయిదా నిబంధనల జారీ
  •  బిజెపి ప్రభుత్వ చేతిలో దుర్వినియోగమయ్యే అవకాశం

న్యూఢిల్లీ : ఇకపై బిడ్డ జననాన్ని నమోదు చేసే సమయంలో ఆ బిడ్డ తల్లిదండ్రులు విడివిడిగా తమ మతాన్ని నమోదు చేయాల్సిన అవసరం వుందని కేంద్ర హోంశాఖ రూపొందించిన ముసాయిదా నిబంధనలు పేర్కొంటున్నాయి. ఈ నిబంధనలను అమలు చేయడానికి ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ఆమోదించి, నోటిఫై చేయాల్సి వుంటుంది. ఇప్పటివరకు వున్న పద్ధతి ప్రకారం, జననాన్ని నమోదు చేసే సమయంలో కుటుంబం మతాన్ని మాత్రమే నమోదు చేసేవారు. ప్రతిపాదిత ”ఫామ్‌ నెంబర్‌.1-బర్త్‌ రిపోర్ట్‌”లో బిడ్డ మతానికి సంబంధించి టిక్‌ మార్క్‌ పెట్టడానికి మాత్రమే ఒక కాలమ్‌ వుంది. ఆ కాలమ్‌ను ఇప్పుడు విస్తరించి తండ్రి మతం, తల్లి మతం విడివిడిగా నమోదు చేయాలి. జననాల, మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023 కింద నమోదు చేసే జనన, మరణాల డేటా బేస్‌ను జాతీయ జనాభా రిజిస్టర్‌, ఓటర్ల జాబితా, ఆధార్‌ నెంబరు, రేషన్‌ కార్డు, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆస్తి రిజిస్ట్రేషన్‌ వంటి వాటిని అప్‌డేట్‌ చేసేటపుడు ఉపయోగిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మతం ఆధారంగా తీసుకొచ్చే ఈ చట్టాన్ని అది దుర్వినియోగం చేసే ప్రమాదముంది. గతేడాది అక్టోబరు 1 నుండి అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం, దేశంలో నమోదయ్యే జననాల డేటా అంతా కేంద్రం వద్ద పోగుపడుతుంది. . ఈ వ్యవస్థ కింద జారీ చేసే డిజిటల్‌ జనన ధ్రువీకరణ పత్రాలు విద్యా సంస్థల్లో ప్రవేశం, ఉద్యోగ నియామకాలతో సహా వివిధ సర్వీసులకు పుట్టిన తేదీ, మతం రుజువును చేసేందుకు ఏకైక డాక్యుమెంట్‌గ ఇదిా వుంటుంది. జనన, మరణాలు, దత్తతలు, మరణ కారణాన్ని తెలియచేసే మెడికల్‌ సర్టిఫికెట్‌లకు సంబంధించి ప్రస్తుతమున్న ఫామ్‌ల స్థానంలో కొత్త వాటిని తీసుకురావాలని కేంద్ర హౌం శాఖ ప్రతిపాదించినట్లు ముసాయిదా నిబంధనలు పేర్కొంటున్నాయి.
రెండు భాగాలుగా సర్టిఫికెట్‌ :జనన నమోదు పత్రం రెండు భాగాలుగా వుంటుంది : ఒకటి లీగల్‌ సమాచారం, రెండోది గణాంక సమాచారం. తల్లిదండ్రుల మతానికి సంబంధించిన సమాచారం గణాంక సమాచారంగా వర్గీకరించబడుతుంది. లీగల్‌ సమాచారం వుండే భాగంలో ఆధార్‌ నెంబరు, తల్లిదండ్రుల మొబైల్‌ నెంబర్లు, ఇ మెయిల్‌ ఐడిలు వుంటాయి. అడ్రస్‌ బాక్స్‌ మరింత వివరంగా వుంటుంది. రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, పట్టణం లేదా గ్రామం, వార్డు నెంబరు, లొకాలిటీ, ఇంటి నెంబరు, పిన్‌ కోడ్‌ సమాచారం వుంటుంది.

➡️