మహిళల చుట్టూ మతమూ – మార్కెట్టూ …!

Religion and market around women...!
  • ”ఆడవాళ్లు పుట్టరు, తయారు చేయబడతారు” అంటారు ఓ ప్రముఖ రచయిత. అవున్నిజమే! మతమూ, మార్కెట్టూ, చుట్టూ ఉన్న సమాజమూ ఈ ‘తయారీ పని’ చేస్తాయి. సొంత ఆలోచనలను హరించి, తమ తమ చట్రాల్లో బందీలను చేస్తాయి, చేస్తున్నాయి.

మతమంటే పాత భావాల గంప అని, మార్కెట్టు అంటే కొత్త సరుకుల సంత అని మనం సహజంగా అనుకుంటాం. రెంటికీ పొంతనా, పోలికా ఎలా కుదురుతుందని ప్రశ్నించుకుంటాం. కానీ, లాభాలే ప్రధానమైన మార్కెట్టుకు మతం కూడా ఒక ఉపయుక్త సాధనం. మతం ద్వారా లబ్ధి పొందే వ్యాపార, రాజకీయ శక్తులకు మార్కెట్టు ఒక మత వ్యాప్త ఉపకరణం. ఇవి రెండూ మహిళలపై వివిధ రూపాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తాయి.

  • మత ప్రభావం

ఈ భూమ్మీద ఏ మతమైనా మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూస్తుంది. పురుషులకు అనువైన సూత్రాలను సృష్టించి, దానిచుట్టూ ధర్మాలను అల్లి, అందులో బందీలను చేస్తుంది. స్త్రీకి సొంతంగా స్వాతంత్య్రం లేదని, నిరంతరం పురుషుడి నీడలోనే పరిమితమైన స్వేచ్ఛను, స్వతంత్రతనూ ప్రసాదిస్తుంది. దీనిని మాటలకే పరిమితం చేయదు. అది నిర్వర్తిస్తే సర్వ సాంస్కృతిక, పర్వదిన, కుటుంబ కార్యకలాపాల్లో విడదీయలేనంత భాగం చేస్తుంది. అది అల్లుకొని ఉన్న సమాజం ఎంత విస్తారంగా, ఎంత లోతుగా ఉందో – ఆ మేర అంతటా అణువణువూ ఆ సాంస్క ృతిక భావజాలం, నిఘా నిత్యం చలనశీలంగా ఉంటాయి. ఇది అన్ని కాలాల్లోనూ, అన్ని సందర్భాల్లోనూ ఒకేలా ఉండదు. ఉండడం సాధ్యం కాదు కూడా! ఆ పరిధిని దాటి ఆ సమూహపు అవసరాలు విస్తరించే కొద్దీ – మత సంబంధ తంతులు కట్టుదిట్టతలోంచి కాస్త కాస్తగా తగ్గుముఖం పడతాయి. మళ్లీ కొత్త కొత్త రూపాల్లో వచ్చి చేరతాయి. ఈ బంధనాలను ప్రయత్నపూర్వకంగా విడగొట్టుకునే ప్రయత్నం ఆధునిక సమాజం ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి!

  • కట్టుబాట్లతో బంధనం!

స్త్రీ జీవితమంతా పురుషుడితోనే ముడిపడి ఉంటుందన్న కట్టడి అన్ని మతాల్లో ఉంది. పురుషుడు ఏ కారణంతోనైనా మరణిస్తే ఆమె కట్టూబొట్టూ మార్చుకోవటం, గాజులు తీసేయడం వంటివి హిందూ సమాజంలో ఉంది. కానీ, ఈ తంతు ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. శ్రమ లేని కుటుంబాల్లో ఉన్నంత తంతు శ్రామిక కుటుంబాల్లో ఏనాడూ లేదు. తల్లిదండ్రులు మరణిస్తే తలకొరివి పెట్టేది పుత్రుడే అన్న ఆచారం ఒకటుంది. ‘పున్నామ నరకం నుంచి తప్పించువాడు పుత్రుడు’ అన్న నమ్మకం దానికి పునాది. ఇలాంటివి అన్నీ కలిపి పుత్రసంతానానికి ప్రాధాన్యం పెంచాయి. ఆడపిల్ల అంటే ‘ఆడ’పిల్లే కానీ, ‘ఈడ’పిల్ల కాదనే వికృత భాష్యాలూ వచ్చాయి. పిల్లలను వారి జెండర్‌ను బట్టి ప్లస్సూ, మైనస్సూ అని వ్యాఖ్యానించే వ్యాపార భాష అప్పుడప్పుడు కొందరి దగ్గర వినిపిస్తుంది. తమ మాంగల్యాన్ని కాపాడుకునే బృహత్తర గృహ బాధ్యత గృహిణుల మీదనే ఉంటుంది. అందుకోసం బోలెడు పూజలూ వ్రతాలూ, తంతులూ తతంగాలూ ఉంటాయి. భార్య శ్రేయస్సు కోసం, ఆయుష్షు కోసం మగవాళ్లు చేయాల్సిన వ్రతాలను ఏ మతగ్రంథమూ సిఫార్సు చేయలేదు. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలను ఎత్తి చూపితే- రకరకాలుగా కథలు చెప్పే భాష్యకారులు పుంఖానుపుంఖాలుగా ఉన్నారు. ఎవరు ఏ భాష్యం చెప్పినా కళ్లముందు కనిపించే వివక్షను ఎవరూ కాదనలేరు.

ఆధునిక కాలంలో మనం ఉన్నాక, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మన సర్వ కార్యకలాపాల్లోనూ స్పష్టాతిస్పష్టంగా కనపడు తున్నాక- మూఢ నమ్మకాలు, దురాచారాలూ పటాపంచలై పోవాలి. కానీ, అలా జరగటం లేదు. సైన్సు అందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్కెట్టు వాడుకుంటోంది. ఆ మార్కెట్టులోకి మతం ప్రవేశించింది. మతమూ – మర్కెట్టూ ఇప్పుడు చెట్టాపట్టా లేసుకొని చక్కా వ్యాపారంచేసుకుంటున్నాయి. వీటి జమిలి ప్రయాణం మహిళా ప్రగతికి మరింత ఆటంకదాయకం. అనర్థకారకం.

  • నట్టింట్లో నాన్సెన్సు !

మన ఇంట్లోకి వచ్చిన టీవీలు పొద్దు ప్రారంభం అయిన దగ్గర నుంచి నిరంతరం భక్తి. సాంప్రదాయ వ్యాపకాలను ప్రవచిస్తున్నాయి. ఏ క్షణాన ఎలా మసలుకుంటే ఏఏ లాభాలు వచ్చి వాలతాయో; ఎలా వ్యవహరించకపోతే ఏఏ కష్టాలు చుట్టుముడతాయో కచ్చితంగా హెచ్చరిస్తున్నాయి. చాలామంది గృహస్థులు వాటిని ఆచరించే పనిని నెత్తిన వేసుకుంటున్నారు. తాము చూస్తున్న సీరియళ్లలోనూ అతీతశక్తులూ, వాటి ప్రభావాలూ, వాటికి నివారణోపాయాలూ ఇబ్బడిముబ్బడిగా దర్శనమిస్తున్నాయి. బయట చదువులూ, ర్యాంకులూ, ఉద్యోగాలూ, పెళ్లిళ్లూ, పేరంటాలూ తదితర సామాజిక విషయాల్లో పోటాపోటీ పెరిగిపోయింది. బయట వచ్చే సమస్యలన్నిటికీ పరిష్కారాలు టీవీల్లో, అవి ప్రకటించే చిట్కాల్లో దొరుకుతాయని చాలామంది భావిస్తున్నారు. కొంతమందికి ఇలాంటి సమస్యలూ, నమ్మకాలూ లేకపోయినా తమ హోదా ప్రదర్శనకు కోటిదీపాలూ, వెయ్యొక్క కొబ్బరికాయలూ, నూటొక్క బిందెలూ వంటి కార్యకలాపాలు దోహదపడుతున్నట్టుగా భావిస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఇసుక దందాలు చేసే సులభ ధన లబ్ధిదారులూ కొన్ని కొన్ని బృందాలకు ఉదారంగా విరాళాలు వెదజల్లడం కూడా భక్తి ప్రదర్శనలకు కారణమవుతోంది. వీటన్నింటిలో అదనపు సేవ చేయటం మహిళలకు ఓ వ్యాపకంగా మారిపోయింది. భర్త లేదా కొడుకు అయ్యప్ప మాల వేసుకుంటే ఇంటిపని, పొలంపని చేసే మహిళలు స్వాముల కోసం మరింత అదనపు శ్రమ చేయాల్సి వస్తోంది. ప్రత్యేక వంటకాలు, పూజకు దినుసులు సమకూర్చటం వారి కొత్త విధులుగా ముందుకు వస్తున్నాయి. కొద్దిపాటి సంపాదన ఉన్న సాధారణ కుటుంబాల్లో ఈ భక్తి బడ్జెట్‌ భారీ స్థానాన్నే ఆక్రమిస్తోంది. ఈ సందర్భంగా అయ్యే అల్లుడి గారి మొత్తం ఖర్చును అత్తింటి వారే భరించాలన్న కొత్త సాంప్రదాయం ఒకటి పల్లెటూళ్లలో పరవళ్లు తొక్కుతోంది.

శాంతిపూజలు, సర్పదోష నివారణ పూజలు, రకరకాల వ్రతాలూ ఈ మధ్య మరింత పెరిగాయి. కష్ట నివారణ కోసం అని చెప్పి లక్షలు వెచ్చింపజేస్తున్న దృశ్యాలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. వీటన్నింటిలో మహిళలే ప్రధాన పాత్రధారులు. వందేళ్ల క్రితం నాడు గురజాడ, కందుకూరి, ఫూలే వంటి మహానుభావులు ఆశించిన వెలుగుల దారికి ఇది భిన్నమైన పంథా. దీనిని ముందుకు నడిపించటంలో ప్రపంచీకరణ, మార్కెట్టీకరణ కీలకపాత్ర పోషిస్తున్నాయి.

  • వ్యాపారం .. వ్యవహారం!

ఒకపక్క మహిళల అభ్యున్నతి గురించి మాట్లాడుతూనే మరోపక్క మహిళను సరుకుగా దిగుజార్చుతోంది ప్రపంచీకరణ. మార్కెట్లో సరుకుల చలామణికి మహిళలను ప్రచార సాధనంగా వాడుకుంటోంది. సౌందర్య సాధనాలను అమ్ముకోవటానికి మనిషి వ్యక్తిత్వాన్ని తగ్గించి, రంగుకీ రూపుకీ ప్రాధాన్యాన్ని హెచ్చించింది. ‘ఈ క్రీము వాడితేనే మీ ముఖం నిగారిస్తుంది. తద్వారా రాకుమారుడు వంటి మొగుడొస్తాడు లేదా ఉద్యోగం వస్తుంది లేదా అబ్బాయిలు మిమ్మల్ని గుర్తిస్తారు…’ వంటి అర్థాలతో ప్రకటనలు గుప్పిస్తోంది. అదేదో స్ప్రే దట్టించు కుంటే స్త్రీలు వెంటబడిపోతారన్నట్టు చౌకబారు ఉద్దేశాలను ప్రచారం చేస్తోంది. బైకులను అమ్మటానికి, అబ్బాయిలకు షేవింగు కిట్లు, అండర్‌వేర్లూ అమ్ముకోవటానికి అమ్మాయిల శరీరాలతో పోలికలను ఊరిస్తోంది. చెమట, తెల్లజుట్టు, బట్టతల, నల్లరంగు, పొడవు లేకపోవడం, లావుగా ఉండడం వంటి సహజ స్వభావాలను ఎగతాళి చేస్తోంది. వాటి నుంచి బయట పడాలంటే ఫలానా బాండ్ల సరుకులు వాడండి అని బాహాటంగానే నీతిమాలిన నిర్వాకానికి ఒడిగడుతోంది. మద్యం అమ్మకాలను పెంచుకోవటానికి స్త్రీ శరీరాలను ప్రకటనలుగా ఎర వేస్తోంది. ఇలాంటి ప్రకటనల్లో అమ్మాయిలు ఇష్టపూర్వకంగా కనపడేలా అందాల పోటీలు నిర్వహిస్తోంది. శరీర ప్రదర్శన అనేది ఒక ఆత్మగౌరవ పతాక అన్నట్టుగా తప్పుడు అర్థాలను సృష్టిస్తోంది.

స్త్రీ అంగాంగ ప్రదర్శనలతో డబ్బు దండుకోవాలని బరితెగించే మార్కెట్టు, స్త్రీల వ్యక్తిత్వాన్ని, ఆలోచనలనూ గౌరవించని మతమూ చెరోపక్క మహిళల సొంత ముఖాన్ని, వాస్తవ మనసునూ గుర్తించటానికి నిరాకరిస్తున్నాయి. తాము చేస్తున్నదంతా మహిళల ఉద్ధరణ కోసమేనని ఇవి రెండూ ప్రచారం చేస్తున్నాయి. ప్రచారం, ప్రవచనం ఏదైనా సరే, స్త్రీల అణచివేత, అంగడీకరణ – మతం, మార్కెట్‌ల అసలు ఉద్దేశం. దానిని మహిళాలోకం గుర్తించాలి. స్వేచ్ఛా సమానత్వాల కోసం గొంతెత్తి నినదించాలి.

– సత్యాజీ, 9490099167

➡️