దాడుల నిలిపివేతతోనే పాలస్తీనియన్లకు ఉపశమనం!

Dec 1,2023 07:10 #Editorial

గాజా పౌరుల మీద నాలుగు రోజుల పాటు దాడులను నిలిపివేసేందుకు, ఇజ్రాయిల్‌ జైళ్లలో ఉన్న 150 మంది మహిళలు, పిల్లలను, హమాస్‌ వద్ద బందీలుగా ఉన్న వారిలో 50 మంది మహిళలు, పిల్లలను విడుదల చేసేందుకు కుదిరిన ఒప్పందాన్ని మరో రెండు రోజులు పొడిగించారు. గాజా కాలమానం ప్రకారం గురువారం ఉదయం 5 గంటలకు ఆ గడువు ముగిసింది. ఇప్పటి వరకు 99 మంది బందీలు, 210 మంది ఖైదీలకు విముక్తి లభించింది. ఇజ్రాయిల్‌ దాడుల్లో ముగ్గురు బందీలు మరణించినట్లు హమాస్‌ ప్రకటించగా, పిల్లలతో సహా ఇంకా 161 మంది బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయిల్‌ తెలిపింది. దాడుల నిలిపివేత మరికొంత కాలం లేదా పూర్తిగా నిలిపివేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ఇది రాస్తున్న సమయానికి ఎలాంటి నిర్ణయం జరగలేదు. అవగాహన పరిధికి మించి ఇతర కారణాలతో హమాస్‌ అదనంగా 21 మంది బందీలను విడుదల చేసింది. తాజా పరిణామాల వెనుక అమెరికా మీద వస్తున్న ఒత్తిడే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ఇజ్రాయిల్‌కు మద్దతు ఇవ్వవద్దని, మానవ హక్కుల కార్యకర్తలు, చివరికి స్వంత డెమోక్రటిక్‌ పార్టీ నేతలు, మద్దతుదార్ల నుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ ఖాతరు చేయకుండా కొట్టండి, నరకండి, చంపండి, నాశనం చేయండి అంటూ అక్టోబరు ఏడు నుంచి ఇజ్రాయిల్‌ను ప్రోత్సహించిన జోబైడెన్‌ తాజాగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఇజ్రాయిలీ, పాలస్తీనియన్ల దీర్ఘకాల భద్రతకు రెండు దేశాలు ఏర్పడటమే హామీ ఇవ్వగలదని ట్వీట్‌ చేశాడు. కాల్పులను విరమించాలని డిమాండ్‌ చేస్తున్న అమెరికన్‌ పౌరుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. కొన్ని రాష్ట్రాల ప్రజా ప్రతినిధులతో సహా ప్రముఖులు నిరాహార దీక్షలను ప్రారంభించారు. పది లక్షల సంతకాలతో కూడిన మహజరును అందచేశారు.

ఇల్లు కాలుతుంటే బొగ్గులేరుకునే బాపతు అమెరికా అన్నది తెలిసిందే. గాజాలో పరిణామాల గురించి అది వేసుకున్న లెక్కలు తప్పాయి. ఆయుధాలు అమ్ముకోవటానికి వివాదాన్ని ప్రాంతీయ యుద్ధంగా మార్చేందుకు అది విసిరిన వలలో అరబ్బు, ఇస్లామిక్‌ దేశాలు పడలేదు. ప్రాణ నష్టం పరిమితంగా ఉండేట్లు చూడండి అన్న మాటలను యూదు దురహంకారులు ఖాతరు చేయలేదు. చివరికి ఆసుపత్రులు, ఐరాస సహాయ కేంద్రాలు, శరణార్ధుల శిబిరాలనూ వదల్లేదు. అన్ని రకాల యుద్ధ నేరాలకు పాల్పడ్డారు. హమాస్‌ తీవ్రవాదులను ఏరివేసే పేరుతో ప్రారంభించిన దాడులు 70 శాతం పైగా పిల్లలు, మహిళలతో సహా 15 వేల మంది అమాయక పౌరుల ప్రాణాలు తీయటం, హమాస్‌ వద్ద ఉన్న బందీల జాడను కనుగొనటంలో వైఫల్యం, మరికొన్ని వేల మందిని చంపినా హమాస్‌ కార్యకర్తలు జాడ దొరకదనే అభిప్రాయం బలపడుతుండటంతో గౌరవప్రదంగా వెనక్కు తగ్గేందుకు అమెరికా సూచన మేరకే ఖైదీల విడుదలకు ఇజ్రాయిల్‌ అంగీకరించింది. సహజంగానే పాలస్తీనియన్ల వత్తిడి హమస్‌ మీద కూడా పని చేసింది.

గడచిన ఏడున్నర దశాబ్దాలుగా ఇజ్రాయిల్‌ మూకలు ఎన్ని పాలస్తీనా విముక్తి సంస్థలను అణచివేసినా, ఎందరిని చంపినా కొత్త యోధులు ఉద్భవిస్తూనే ఉన్నారు, కొత్త సంస్థలు ఉనికిలోకి వస్తున్నాయి. అందువలన అపరిమిత బలంతో ఒకవేళ హమాస్‌ ను అణచివేసినా మరో కొత్త సంస్థ పుట్టుకురాదనే హామీ లేదు. గత చరిత్ర చెప్పింది అదే. దశాబ్దాల తరబడి గాజా, వెస్ట్‌బాంక్‌లను దిగ్బంధించినా, ఆక్రమించినా సాధించిందేమీ లేదు. ఇటువంటి స్థితిలో మరికొద్ది వారాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభం కానున్నది. మారణకాండ కొనసాగితే సమర్ధించుకోవటం మరింత కష్టం అవుతుంది. అమెరికన్లు అనేక మంది బందీలుగా ఉన్నందున వారి విడుదల వెంటనే జరగకపోతే అది ఎన్నికల అంశంగా మారినా ఆశ్చర్యం లేదు. ఇతరులను ఎంత మందిని చంపినా ఫరవాలేదన్నట్లుగా ఉండే అమెరికన్లు తమవారి దగ్గరకు వచ్చేసరికి ఒక్కరికి హాని జరిగినా తీవ్రంగా స్పందించటం తెలిసిందే. దాడులను విరమిస్తే హమాస్‌ పలుకుబడి పెరుగుతుందని, దాని సాయుధ విభాగం మరింత పటిష్టమౌతుందని ఇజ్రాయిల్‌ వెనక్కు తగ్గేది లేదని అంటున్నా బైడెన్‌ తన రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నాడు. అందుకే కొత్త పల్లవి, ఇజ్రాయిల్‌ మీద ఒత్తిడి అన్నది స్పష్టం. గతంలో కూడా ఇలాగే కొన్ని వారాల తరువాత దాడుల నిలిపివేత, తిరిగి అణచివేత జరిగింది. ఎవరు ఎలాంటి ఉద్దేశ్యంతో ఉన్నప్పటికీ మారణకాండ నిలిపివేత పాలస్తీనియన్లకు ఉపశమనం కలిగిస్తుంది. అందుకే శాంతి శక్తులు ఒప్పందాన్ని హర్షించాయి. అది శాశ్వతంగా కుదిరితే అంతకంటే కావాల్సింది లేదు.

                                – ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌

➡️