సిక్కింలో ప్రాంతీయ పార్టీలదే హవా..!

Apr 11,2024 03:25 #2024 elections, #sikkam

ఈశాన్య భారత్‌లోని అతిచిన్న రాష్ట్రాల్లో ఒకటి సిక్కిం. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీలే పోటీలో ఉన్న సిక్కింలోకి బిజెపి చొరబడాలని చూస్తోంది. 2009 నుంచి తన అభ్యర్థులను నిలబెడుతూ గెలవాలని చూస్తున్నా అక్కడి ప్రజలు ప్రాంతీయ పార్టీలవైపే మొగ్గుచూపుతున్నారు.

స్వతంత్ర రాజ్యం నుంచి…
1642లో సిక్కిం ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పడి ఛోగ్యాల్‌ రాజుల ఏలుబడిలో ఉండేది. 12 మంది రాజులు సిక్కింను పాలించారు. 18వ శతాబ్దంలో సిక్కింను బ్రిటిష్‌ ప్రభుత్వం వశరుచుకుంది. భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చే నాటికి సిక్కింపై బ్రిటీష్‌ వారికున్న అధికారాలను భారత్‌కు బదిలీ చేశారు. భారత రాజ్యాంగ పరిధిలోకి చేర్చుకునేందుకు కొంత సమయం పట్టటంతో ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించారు. 1975మే 16న ప్రజల అంగీకారంతో సిక్కింను భారత ప్రభుత్వంలో విలీనం చేశారు. 1977లో తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో సిక్కిం కూడా పాల్గొంది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు పదిసార్లు ఎన్నికలు జరిగాయి. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్‌ 2న వెలువడనున్నాయి. లోక్‌సభ ఓట్ల లెక్కింపు జూన్‌ 4న చేపడతారు.

అసెంబ్లీ ఎన్నికలు
సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలున్నాయి. 1979 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు మాత్రమే గెలుస్తున్నాయి. పవన్‌ చామ్లింగ్‌ వరుసగా ఐదు సార్లు సిఎంగా గెలుపొందారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 17 స్థానాలు గెలుచుకుని సిక్కిం క్రాంతికారా మోర్చా (ఎస్‌కెఎం) పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ పార్టీ 15 స్థానాలను గెలుచుకుంది. బిజెపి 12 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక్కసీటు కూడా సాధించలేకపోయింది. కానీ, ప్రతిపక్ష ఎస్‌డిఎఫ్‌ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ఫిరాయించేలా చేసింది. 2019 బైపోల్స్‌లో ప్రతిపక్ష ఎస్‌డిఎఫ్‌తో పొత్తు పెట్టుకుని రెండు స్థానాలను గెలుచుకుంది.

ఒకే ఒక్క లోక్‌సభ స్థానం
సిక్కిం లోక్‌సభ స్థానానికి 14 మంది పోటీ పడుతున్నారు. 2019లో ఎస్‌కెఎం పార్టీ నుంచి ఇంద్ర హంగ్‌ సుబ్బా గెలిచారు. హిమా లయ పర్వత ప్రాంతంలో ఉన్న సిక్కిం రాష్ట్రం నేపాల్‌, భూటాన్‌, టిబెట్‌ (చైనా) దేశాలతో సరిహద్దులు కలిగి ఉండటంతో అన్ని ప్రాంతాల వారు ఇక్కడ స్థిరపడ్డారు. మొత్తం 4,62,456 మంది ఓటర్లు ఉన్నారు. 2,32,117 మంది పురుషులు, 2,30,117 మంది మహిళా ఓటర్లు. అసెంబ్లీ ఎన్నికల్లో 12 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

కార్పొరేట్ల ప్రకృతి విధ్వంసం
గత ఏడాది అకస్మాత్తుగా సంభవించిన తీస్తా నది వరదలు రాష్ట్రంలో బీభత్సం సృష్టించాయి.వరదలకు 41,870 మంది ప్రభావితమయ్యారు. 39 మంది మృతిచెందారు. వందమందికి పైగా గల్లంతయ్యారు. జాతీయ రహదారి కోసం కొండలపై తవ్వకాలు, తీస్తా నదిపై బ్రిడ్జిలు నిర్మించడంతో ఈ భయానక వాతావరణం ఏర్ప డిందని స్థానికులు భావిస్తున్నారు. ఈసారి బిజెపి ఎలాగైనా గెలు పొందాలని చూస్తున్నా ఇక్కడి ఓటర్లు మాత్రం ప్రాంతీయ పార్టీలకే మద్దతు పలు కుతున్నారు.

– ఎలక్షన్‌ డెస్క్‌

➡️