ఏడేళ్ల కనిష్టానికి స్టార్టప్‌ నిధులు

Jan 7,2024 10:27 #central funds, #startups
reduce start up funds
  • గతేడాది 73 శాతం పతనం

న్యూఢిల్లీ : భారతీయ స్టార్టప్‌లు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. మోడి ప్రభుత్వానికి కార్పొరేట్లకు వేల కోట్ల రుణాలు ఇప్పించడంలో ఉన్న ఆసక్తి.. చిన్న సంస్థలకు నిధుల మద్దతు అందించడంలో లేదని స్పష్టమవుతోంది. గతేడాది డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్టార్టప్‌ల నిధుల సమీకరణ ఏడేళ్ల కనిష్టానికి పడిపోయాయి. 2016 మూడో త్రైమాసికం నాటి స్థాయికి నిధుల లభ్యత తగ్గింది. గడిచిన త్రైమాసికంలో కొత్త వెంచర్‌ స్టార్టప్‌లు అత్యల్ప ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌లతో తీవ్ర ఆందోళన పరిస్థితులను ఎదుర్కొన్నాయని ట్రాక్సన్‌ రీసెర్చ్‌ వేదిక పేర్కొంది. భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, బ్రిటన్‌, చైనా, సౌత్‌ ఈస్ట్‌ ఏసియా దేశాల్లోనూ స్టార్టప్‌లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. 2023లో భారతీయ స్టార్టప్‌లు నిధుల సమీకరణలో దాదాపు 73 శాతం క్షీణతను చవిచూశాయి. అంతకుముందు సంవత్సరంలో 25 బిలియన్లతో పోలిస్తే గతేడాది ఏడు బిలియన్లను సేకరించాయి. 2022 నుంచి స్టార్టప్‌లు నిధుల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫిన్‌టెక్‌, రిటైల్‌, ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్లు, ఎన్విరాన్‌మెంట్‌ టెక్‌, స్పేస్‌ టెక్‌ రంగాల స్టార్టప్‌లు ఎక్కువ నిధులు సమీకరించగలిగాయి. గతేడాది ఫిన్‌టెక్‌ రంగం 2.8 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించగా.. అంతక్రితం ఏడాది 5.8 బిలియన్‌ డాలర్లను పొందాయి. 2023లో రిటైల్‌ రంగం స్టార్టప్‌లు 67 శాతం పతనంతో 1.9 బిలియన్‌ డాలర్ల నిధులను అందుకున్నాయి.

➡️