జిఓ 3 పునరుద్ధరణ

Jan 21,2024 08:19 #Nara Chandrababu, #speech

– అధికారంలోకి వస్తే ప్రత్యేక జిల్లాగా పోలవరం ప్రాంతం

గిరిజనులను నమ్మించి గొంతుకోసిన వైసిపి

– అరకు, మండపేటల్లో ‘రా కదలిరా’ సభల్లో చంద్రబాబు

ప్రజాశక్తి – డుంబ్రిగుడ(అల్లూరి జిల్లా), రాజమహేంద్రవరం ప్రతినిధితాము అధికారంలోకి వస్తే సుప్రీంకోర్టులో పోరాడైనా జిఓ నంబర్‌ 3ని పునరుద్ధరిస్తానని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గిరిజనులను వైసిపి ప్రభుత్వం నమ్మించి గొంతు కోసిందని విమర్శించారు. అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం అరకులోయ, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండపేటలో ‘ రా కదలిరా’ సభల్లో చంద్రబాబు మాట్లాడుతూ.. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కాఫీ పంటను ప్రోత్సహించగా, నేడు వైసిపి ప్రభుత్వం గంజాయి సాగును ప్రోత్సహిస్తోందని విమర్శించారు. బాక్సైట్‌ తవ్వకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన జగన్‌.. లేట్‌రైట్‌ మైనింగ్‌ ముసుగులో బాక్సైట్‌ను కూడా తవ్వి భారతి సిమెంట్స్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు. గిరిజనులకు 45 ఏళ్లకే పింఛను ఇస్తానని చెప్పి.. అమలు చేయకుండా సిఎం మోసం చేశారన్నారు. తాము అధికారంలోకి వస్తే పోలవరం ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఏజెన్సీకి చెందిన అరకు, పాడేరు, పార్వతీపురం, సాలూరు, రంపచోడవరం ఎమ్మెల్యేలు అధికారం చేపట్టి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని ఆరోపించారు. టిడిపి అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా దొన్నుదొరను ప్రకటించారు. 15 మంది సర్పంచులు, ఇద్దరు ఎంపిటిసి సభ్యులు వైసిపి నుంచి టిడిపిలోకి చేరగా వారికి పార్టీ కండువాలు వేసి చంద్రబాబు ఆహ్వానించారు. ఆక్వా రంగానికి యూనిట్‌కు రూ.1.50కే విద్యుత్‌అధికారంలోకి రాగానే ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు యూనిట్‌ రూ.1.50కే విద్యుత్‌ అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలులో పాత పద్ధతిని తీసుకొస్తామని, ఇన్సూరెన్స్‌ విధానం అమల్లోకి తెచ్చి కష్టకాలంలో రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దళిత ద్రోహి జగన్‌మోహన్‌రెడ్డి అని విమర్శించారు. అంబేద్కర్‌ విగ్రహం పెట్టి సామాజిక న్యాయం అంటూ ప్రచారం చేస్తే నమ్మేదెవరని ప్రశ్నించారు. వైసిపి పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదన్నారు. బిసిల రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేసి రక్షణ చట్టం తీసుకొస్తామన్నారు. ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ముమ్మిడివరంలో బ్రిడ్జి నిర్మిస్తామన్నారు. మాజీ స్పీకర్‌ బాలయోగి చిరకాల వాంఛ అయిన కోనసీమ రైల్వే లైన్‌ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.

➡️