భారతరత్న అవార్డుపై స్పందనలు

Feb 10,2024 11:08 #Bharat Ratna Award, #Reactions

గర్వకారణం : గవర్నరు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్‌సింగ్‌, ఎంఎస్‌ స్వామినాథన్‌కు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును ప్రకటించడం పట్ల గవర్నరు అబ్దుల్‌ నజీర్‌ హర్షం వ్యక్తం చేశారు. పివి నరసింహారావు కేంద్ర స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేశారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా దేశ ఆర్థిక సరళీకరణ, అభివృద్ధి, సంక్షేమానికి గట్టి పునాది వేశారని గవర్నరు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన జీవితమంతా రైతుల హక్కులు, సంక్షేమం కోసం అంకితం చేసిన మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌కు వ్యవసాయ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా, దేశం వ్యవసాయ రంగంలో స్వావలంభన సాధించడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు.

విలువలు కలిగిన నేత పివి : సిఎం జగన్‌

రాజనీతిజ్ఞుడు, రాజకీయ, నైతిక విలువలు కలిగిన పండితుడు, మాజీ ప్రధాని పివి నరసింహారావు అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న అవార్డు పొందడం తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఇది గౌరవమని సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రైతాంగం కోసం పోరాడిన మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌కు భారతరత్న ప్రదానం చేయడం యావత్‌ జాతి గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.

జాతి గర్వించదగిన నేత పివి : చంద్రబాబు

తెలుగు జాతి గర్వించదగిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన రాజనీతిజ్ఞుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇవ్వడం సంతోషకరమని అన్నారు. దేశం ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దడంతోపాటు దేశ వ్యాప్తంగా ఎందరికో ఆయన స్ఫూర్తి ప్రధాత అని పేర్కొన్నారు.

పివికి సముచిత గౌరవం : పవన్‌కల్యాణ్‌

ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన నాయకుడు పివి నరసింహారావు అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సిఎంగా, దేశ, రక్షణ, దౌత్య సంబంధ విషయాల్లో గణనీయమైన విజయాలు సాధించారన్నారు. మరణానంతరం ఆయనకు భారతరత్న రావడం తెలుగుజాతి అందరికీ గర్వకారణమని అన్నారు.

భారతావని గర్వించదగిన రత్నాలు : పురందేశ్వరి

భారతావని గర్వించదగిన రత్నాలు మాజీ ప్రధాని పివి నరసింహారావు, హరిత విప్లవ పితామహులు ఎంఎస్‌ స్వామినాథన్‌కు భారతరత్న ఇవ్వడం హర్షించదగిన పరిణామమని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి పేర్కొన్నారు. నిజమైన రాజనీతిజ్ఞుడు పివి, నేల పుత్రుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ ఈ గౌరవానికి అర్హులు అని అన్నారు.

➡️