రాయలసీమ నీటి సమస్యసాహిత్యంలో ప్రతిబింబించాలి

Mar 4,2024 11:05 #jala kavanam

జలకవనంలో వక్తల పిలుపు

ప్రజాశక్తి -పెనుకొండ : రాయలసీమ జిల్లాల్లో నెలకొన్న నీటి సమస్య సాహిత్యంలో ప్రతిబింబించాలని జలకవనంలో పలు వురు వక్తలు పిలుపు నిచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణం లోని గగన్‌ మహల్‌ ఆవరణంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యాన రాయలసీమ జిల్లాల జలకవనం ఆదివారం నిర్వహించారు. సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్‌ ఎ.హరి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌, రాయలసీమ జలసాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి, కవులు ఏలూరి యంగన్న, సడ్లపల్లి చిదంబర రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వర్షపాతం తక్కువగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో నీటి సమస్య పరిష్కారంలో పాలకులకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయకపోవడం, వర్షపు నీటిని నిల్వ చేసుకొనే సామర్థ్యం లేకపోవడంతో నీటి ఎద్దడి రోజు రోజుకు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జలకవనంలో జరిగే సాహిత్యం ద్వారా నీటి సమస్యపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వాలు కళ్లు తెరిచే విధంగా కవితలు, పద్యాలు, పాటలు ఉండాలన్నారు. రాయలసీమ ఎదుర్కొంటున్న నీటి కరువుకు కారణాలు ఏమిటో కవులు, రచయితల పాటలు, పద్యాలు, కవితల ద్వారా ప్రతిబింబింపజేయాలని సూచించారు. రాయలసీమకు అడుగుతున్న నీటి హక్కులు ప్రాంతీయ తత్వం కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జిల్లాల నుంచి వచ్చిన కవులు, గాయకులు తమ కవితలను, పద్యాలను, పాటలను వినిపించారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి సభ్యులు రాజశేఖర్‌, కోగిర జయచంద్ర, రామన్న, యుటిఎఫ్‌ నాయకులు సుధాకర్‌, నారాయణ స్వామి, రమేష్‌, పలువురు మేధావులు, ప్రముఖులు పాల్గొన్నారు.

➡️