రాస్తారోకోలు, భారీ ర్యాలీలు – 11వ రోజూ కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె

Dec 23,2023 11:42 #11, #Anganwadi strike, #continues, #days

ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ మాటలకు, ఫుడ్‌ కమిటీ చైర్మన్‌ చింతా ప్రతాపరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు రాస్తారోకోలు నిర్వహించారు. సమ్మెలో భాగంగా 11వ రోజు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించారు. వీరి పోరాటానికి సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ పార్టీ, టిడిపి, జనసేన పార్టీ, సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరులో రాష్ట్ర ఫుడ్‌ కమిటీ చైర్మన్‌ చిత్తా విజరు ప్రతాప్‌రెడ్డిని అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు అడ్డుకొని ఆయన కారు ముందు బైటాయించారు. నోటికొచ్చినట్లు మాట్లాడినందుకు తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ, తాను తీసిన వీడియోను మీకు ఎవరో కట్‌ చేసి పంపారని, త్వరలో పూర్తి వివరాలతో మరొక వీడియో తీసి యూట్యూబ్‌లో పెడతానని అన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు అనుకూలంగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో వీలైనంత త్వరగా మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో, వారు శాంతించారు. బాపట్ల జిల్లా మార్టూరులో అంగన్‌వాడీల రాస్తారోకోతో నిలిచిపోయిన ట్రాఫిక్‌లో శ్రీకాకుళం నుండి తిరుపతి వెళ్తున్న మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు కాన్వాయ్ చిక్కుకుపోయింది.

ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద అంగన్‌వాడీలు ర్యాలీగా వచ్చి బైటాయించి రాస్తారోకో చేశారు. రైతు సంఘాల సమన్వయ సమితి, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు), ఆశా వర్కర్స్‌ యూనియన్‌, ముఠా వర్కర్స్‌ యూనియన్‌ తదితర సంఘాల నేతలు, కార్యకర్తల పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ వడ్డె శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గద్దెదించితేనే అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమవుతాయన్నారు. ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కె.ఉమామహేశ్వరరావు, కెవివి.ప్రసాద్‌, వి.కృష్ణయ్య, వై కేశవరావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఎరిగేరిలో అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసేందుకు ఆహారం తీసుకొచ్చిన వాహనాన్ని అంగన్‌వాడీలు అడ్డుకున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు రోడ్డుపై చేశారు. తిరుపతి పాత మున్సిపల్‌ కార్యాలయం ముందు అంగన్‌వాడీలు రాస్తారోకో నిర్వహించారు. వారి పోరాటానికి మాజీ ఎంఎల్‌సి కత్తి నరసింహారెడ్డి మద్దతు ప్రకటించారు. నెల్లూరులో ఆర్‌టిసి బస్టాండ్‌ వద్ద మానవహారం నిర్వహించారు. ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయానికి ర్యాలీగా వచ్చి అక్కడ బైటాయించారు. గుంటూరులో కలెక్టరేట్‌ ఎదుట రహదారిపై అంగన్‌వాడీలు బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల లబ్ధిదారులు ఎర్ర చీరలు ధరించి, కోలాటం ప్రదర్శించి వారిలో ఉత్సాహం నింపారు. దుగ్గిరాలలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుకు అంగన్‌వాడీలు వినతిపత్రం ఇచ్చారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రాస్తారోకో చేశారు. పిడుగురాళ్లలో మోకాళ్లపై నిలిచి నిరసన తెలిపారు. చిలకలూరిపేటలో భారీ ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. ఏలూరులో ర్యాలీ, జిల్లా పరిషత్‌ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళా పక్షపాతినని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గత ఎన్నికల ముందు అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం దారుణమన్నారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించి సమ్మెను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంలో మానవహారాలు, రాస్తారోకోలు నిర్వహించారు. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహానికి ఎదుట అంగన్‌వాడీల రాస్తారోకోలో నిర్వహించారు. వారి పోరాటానికి ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ, టిడిపి ఎమ్మెల్యే గణబాబు, ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర మహిళా కన్వీనర్‌ డాక్టర్‌ శీతల్‌, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ తదితరులు మసంఘీభావం తెలిపారు. అనకాపల్లి జిల్లా కశింకోటలో దీక్షా శిబిరం వద్ద సుత్తి కొడవలి ఆకారంలో అంగన్‌వాడీలు కూర్చొని నిరసన తెలిపారు. ఈ దీక్షా శిబిరాన్ని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు సందర్శించి సంఘీభావం తెలిపారు. అంగన్‌వాడీల సమస్యలను పరిష్కారం చేస్తామన్న తొలుత చెప్పిన రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఇప్పుడు సాధ్యం కాదని చెప్పడం దారుణమన్నారు. అనకాపల్లి జిల్లా చీడికాడలో జాయింట్‌ కలెక్టర్‌, ఆర్‌డిఒ కార్లను అంగన్‌వాడీలు అడ్డుకున్నారు. నర్సీపట్నంలో అంగన్‌వాడీలు మానవహారం చేపట్టారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ మద్దతు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించారు. విజయనగరంలో జాతీయ రహదారిపై బైఠాయించారు.

విశాఖ జిల్లాలో స్పృహ కోల్పోయిన యూనియన్‌ నాయకురాలు

విశాఖ జిల్లా తగరపువలసలో రాస్తారోకోను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో జరిగిన తోపులాటలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకురాలు కె.వెంకటలక్ష్మి స్పృహ కోల్పోయారు. ఒక అంగన్‌వాడీ కార్యకర్తను మహిళా కానిస్టేబుల్‌ బూటు కాలితో తన్నారు. మొత్తం 60 మందిని పోలీసులు అరెస్టు చేసి, అనంతరం విడిచిపెట్టారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం, పెనుకొండలో రాస్తాకోకో చేస్తున్న అంగన్‌వాడీలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీనిని అంగన్‌వాడీలు ప్రతిఘటించ డంతో పోలీసులు వెనక్కి తగ్గారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై, బంటుమిల్లి లక్ష్మీపురం సెంటర్లో, కంకి పాడు మెయిన్‌ సెంటర్లో అంగన్‌వాడీలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి మద్దతుగా నిలిచిన సిఐటియు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వారిని విడుదల చేశారు. తిరుపతి జిల్లా పుత్తూరులో అంగన్‌వాడీల రాస్తారోకోను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నంతో కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా బాపట్ల కంభంలో కందులాపురం సెంటర్‌లో అంగన్‌వాడీల మానవహారాన్ని పోలీసులు అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది.

ఆట, పాటల ద్వారా నిరసన

సమ్మె శిబిరాల్లో అంగన్‌వాడీలు ఆట, పాటల ద్వారా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరలో ‘జగన్‌ గోవిందా… గోవిందా’.. అంటూ పాటలు పాడారు. ‘జీతం పెంచుతా అన్నారు… గోవిందా..!, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇస్తామన్నారు.. గోవిందా..!, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ ఇస్తామన్నాడు… గోవిందా..!, మా సమస్యలు తీర్చలేని జగన్‌ గోవిందా… గోవిందా…!, జగన్‌మోహన్‌రెడ్డి గోవిందా’… అంటూ పాటలు పాడుతూ సమ్మె కొనసాగించారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలోకోలాటం ఆడుతూ, పాటలు పాడుతూ నిరసన తెలిపారు. ఏలూరులో కబడ్డీ, గొబ్బెమ్మ ఆటలాడి, సినిమా పాటలు పాడి నిరసన వ్యక్తం చేశారు.

➡️