రేపిస్టు ఎమ్మెల్యేపై వేటు

Dec 24,2023 09:46 #Lucknow, #MLA, #rape case

లక్నో : బాలికపై అత్యాచారం కేసులో 25 ఏళ్ల కఠిన కారాగార శిక్షకు గురైన ఉత్తర ప్రదేశ్‌లోని బిజెపి ఎమ్మెల్యే రాందులర్‌ గోండ్‌పై అనర్హత వేటు పడింది. ఎనిమిదేళ్ల క్రితం నాటి రేప్‌ కేసులో దుద్హి నియోజకవర్గం ఎమ్మెల్యే గోండ్‌ను సోన్‌భద్రలోని ఎంపి-ఎమ్మెల్యే సెషన్స్‌ కోర్టు ఈ నెల 12న దోషిగా నిర్ధారించింది. మూడు రోజుల తరువాత శిక్షను ఖరారు చేసింది. గోండుకు 25 ఏళ్లు జైలు శిక్ష, రూ 10 లక్షల జరిమానాను సెషన్స్‌ జడ్జి అహ్సన్‌ ఉల్లా ఖాన్‌ విధించారు. జరిమానాను ఇప్పుడు వివాహిత అయిన బాధితురాలికి అందచేయాలని జడ్జి ఆదేశించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించబడిన చట్టసభ్యులను అనర్హలుగా ప్రకటిస్తారనే సంగతి తెలిసిందే.ఈ అత్యాచార ఘటన 2014లో జరగ్గా.. అత్యాచార బాధితురాలి సోదరుడి ఫిర్యాదుతో గోండ్‌పై ఐపిసి సెక్షన్లు 376 (రేప్‌), 506 (నేరమైన బెదిరింపులకు శిక్ష)తోనూ అలాగే లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసారు. ఈ సమయంలో గోండ్‌ ఎమ్మెల్యేగా లేరు, అయితే ఆయన భార్య గ్రామ ప్రధాన్‌గా ఉన్నారు. పోక్సో చట్టం ప్రచారం ఈ కేసు విచారణ ప్రారంభమైంది. అయితే తరువాత గోండ్‌ ఎమ్మెల్యేగా ఎన్నికకావడంతో ఎంపి, ఎమ్మెల్యేల కోర్టుకు బదిలీ చేశారు.ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి వరకూ వేర్వేరు కేసుల్లో దోషులుగా కొంత మంది చట్టసభ సభ్యులపై అనర్హత వేటు పడింది.

➡️