జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు రాంచీ కోర్టు సమన్లు

 రాంచీ :   జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జెఎంఎం) సీనియర్‌ నేత హేమంత్‌ సోరెన్‌పై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. భూకుంభకోణం కేసులో ఇటీవల ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి ) అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇడి నోటీసులను ధిక్కరించినందుకు ప్రాథమికంగా దోషిగా నిర్థారిస్తూ హేమంత్‌ సోరెన్‌కు రాంచీకోర్టు సమన్లు జారీ చేసింది. ఏప్రియల్‌ 3న సోరెన్‌ను కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

” పిటిషన్‌దారు (ఇడి) నివేదికల ఆధారంగా ఐపిసి, 1860లోని సెక్షన్‌ 174 కింద ప్రాథమిక నేరంగా పరిగణించింది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, 1973లోని సెక్షన్‌ 204 ప్రకారం.. నిందితుడు హేమంత్‌ సోరెన్‌ను విచారించేందుకు తగిన ఆధారాలున్నాయి” అని రాంచీ కోర్టు చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కృష్ణ కాంత్‌ మిశ్రా నోటీసుల్లో పేర్కొన్నారు.

హేమంత్‌ సోరెన్‌పై ఇడి ఇటీవల రాంచీ కోర్టులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన తనకు జారీ చేసిన ఏడు సమన్లను దాటవేశారని, దర్యాప్తుకు హాజరుకాలేదని తెలిపింది.   ఐపిసి సెక్షన్‌ 174 కింద ఆయనను విచారించాలని ఇడి ఫిర్యాదులో పేర్కొంది. గతేడాది ఆగస్టు 14న మొదటి సారి ఇడి సమన్లు జారీ చేసింది.

మనీలాండరింగ్‌ ఆరోపణలపై సోరెన్‌ను జనవరి 31న రాంచీలోని తన నివాసం నుండి ఇడి ఆరెస్ట్‌ చేసింది. అరెస్టుకు ముందు ఆయన జార్ఖండ్  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై కూడా ఇడి ఢిల్లీకోర్టులో ఇదేవిధమైన ఫిర్యాదు చేసింది. ఆయన మూడు సార్లు సమన్లను ధిక్కరించారని పేర్కొంది.

➡️