రాందేవ్‌ బాబా కోర్టుకు రావాల్సిందే

  • అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు
  • తప్పుడు ప్రకటనలపై విచారణ

న్యూఢిల్లీ : ప్రముఖ కార్పొరేట్‌ వ్యాపారి, యోగా గురు రాందేవ్‌ బాబాకు సుప్రీంకోర్టు మరోమారు షాక్‌ ఇచ్చింది. తదుపరి విచారణకు స్వయంగా ఆయన హాజరు కావాలని మంగళవారం అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పతంజలి ఆయుర్వేదంపై వాణిజ్య ప్రకటనలు జారీ చేసినందుకు తాము జారీ చేసిన షోకాజ్‌ కంటెప్ట్‌ పిటిషన్‌కు వివరణ ఇవ్వడానికి వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయమూర్తులు హిమాకోహ్లీ, అహ్సానుద్దీన్‌ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. డ్రగ్స్‌ అండ్‌ రెమెడిక్స్‌ యాక్ట్‌ 1954లోని 3,4 సెక్షన్లను రాందేవ్‌ బాబాతో పాటు పతంజలి ఆయుర్వేద్‌ సిఇఒ ఆచార్య బాలకృష్ణ ఉల్లంఘించినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించడంతో అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌ అయ్యింది.
ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ 2022లో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) పిటిషన్‌ దాఖలు చేసింది. అన్ని రకాల వ్యాధుల నివారణకు పతంజలి ఆయుర్వేద మందులు పని చేస్తాయంటూ దేశవ్యాప్తంగా వాణిజ్య ప్రకటనలు జారీ చేయొద్దని రాందేవ్‌ బాబాను ఇంతకుముందు విచారణలో అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో ఎటువంటి ప్రకటనలు చేయొద్దని గతేడాది నవంబర్‌ 21న తీవ్రంగా హెచ్చరించింది. ఈ అంశంలో రూ.1 కోటి జరిమానా కూడా విధించింది.
ఇకపై ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో పతాంజలి కోర్టుకు హామీ ఇచ్చింది. దీన్ని మళ్ళీ విస్మరించడంతో ఐఎంఎ తిరిగి కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. కంపెనీ ఉత్పత్తుల ప్రచారం, వాటి సామర్థ్యానికి సంబంధించిన ప్రకటనల విషయంలో కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించడంపై ఇటీవలి విచారణలోనూ న్యాయమూర్తులు హిమా కోహ్లీ, అమనుల్లాతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు పతంజలి ఆయుర్వేద్‌ సంస్థపై ఏం చర్యలు తీసుకున్నారని తాజా విచారణలో కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. కాగా.. రాందేవ్‌ బాబా, ఆచార్య బాలకృష్ణ ఏ రోజున హాజరు కావాలనేది కోర్టు ప్రకటించలేదు. తదుపరి విచారణ ఎప్పుడనేది వెల్లడి కావాల్సి ఉంది.

➡️