రామమందిరమా! విద్యావైద్య అభివృద్ధా?

Dec 14,2023 07:30 #Articles, #Rama Mandir
rama mandiram or education, health care

అయోధ్యలో రాంలాల్‌ మందిరం నిర్మిస్తామనే మతతత్వ ఎన్నికల హామీతో హిందువుల ఓట్ల బ్యాంకును కొల్లగొట్టి 2014లో బిజెపి తొలిసారిగా కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆపైన మతతత్వాన్ని కాదు..కాదు… హిందూత్వాన్ని పెంచి పోషించే తన విధానాలతో హిందువుల అభిమానాన్ని పెంచుకుపోతూ 2019లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా బలాన్ని పెంచుకుంది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా విజయం సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చేసే ప్రయత్నంలో భాగమే జనవరిలో తలపెట్టిన రామమందిర ప్రారంభోత్సవం! ప్రస్తుత దేశ పరిస్థితుల్లో ‘దేశాభివృద్ధికి ప్రజావసరాలు తీర్చే విశ్వవిద్యాలయాలు, వైద్య విశ్వవిద్యాలయాలు, జాతికి పునరంకితం చేసే పరిశ్రమలు, బహుళార్ధసాధక ప్రాజెక్టులు, వ్యవసాయిక అభివృద్ధి ప్రణాళికలు, అన్ని హంగులతో సకలజన ఆసుపత్రులు కావాలా? లేక అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవమా? విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి! వామపక్ష పార్టీలు, ఏ రాజకీయ పార్టీలకూ చెందని, ఏ మతం పట్ల ప్రత్యేకమైన అభిమానం, వ్యతిరేకత లేని విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళా సంఘాలు ఏకమై బిజెపి ఎత్తుగడలను సమాజానికి చెప్పాలి. ‘ఈచ్‌ వన్‌ టీచ్‌ టెన్‌!’ నినాదంతో ఆమూలాగ్రం రెండు దఫాల బిజెపి పాలనలో జరిగిన దారుణాలను వివరించాలి! కులం-మతం పరంగా అల్ప సంఖ్యాక వర్గ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొన్న ఎదుర్కొంటున్న, దుర్భర పరిస్థితులను, కోల్పోతున్న మానవ-పౌర హక్కులను సోదాహరణంగా వివరించాలి! అన్నదాతల పోరాటాలు, వారికి వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం చేసిన రైతు వ్యతిరేక చట్టాలను, నూతన పౌరసత్వ చట్టాలను, వాటిని వ్యతిరేకిస్తూ జరిగిన ఐక్య పోరాటాలను చాటిచెప్పాలి! గోద్రా నుండి మణిపూర్‌ దాకా బిజెపి చేసిన ఘోర కృత్యాలను తెల్పి ప్రజలను నిత్యం జాగరూకులను చేసే ప్రయత్నాలను ఐక్యవేదికగా చేయాలి. దీనికై సాంస్కృతిక దళాలను రూపుదిద్దాలి!మొత్తం మీద ‘అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం పురస్కరించుకుని కేద్ర ప్రభుత్వం పన్నిన పన్నాగాల గుట్టు రట్టు చేసి, 2024 సార్వత్రిక ఎన్నికలలో అధికారం దక్కకుండా బిజెపిని వేళ్ళతో సహా పెకిలించాలి! లేదంటే భారతదేశం, హిందూ దేశంగా, హిందువుల దేశంగా, లౌకిక రాజ్యాంగాన్ని హిందూ మతతత్వ రాజ్యాంగంగా బిజెపి మార్చే ప్రమాదాన్ని దేశ ప్రజలంతా ఎదుర్కొనక తప్పదు!

– చాకలకొండ శారద, విశ్రాంత ప్రధానోపాధ్యాయిని, కావలి, ఎస్‌పిఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా.

➡️