రాజధాని రభస – 1955 ఎన్నికలు

Apr 10,2024 07:20 #2024 elections, #ap election

మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం 1953 అక్టోబరు 1న విడిపోయి ఆంధ్రరాష్ట్రంగా అవతరించింది. 1952లో ఎన్నికలు జరిగాక సాధారణంగా ఐదేళ్లు పూర్తయ్యాక అంటే 1957లో ఎన్నికలు జరగాలి. కానీ కొత్త రాష్ట్రం ఏర్పడిన దరిమిలా.. అంతకుముందు మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రాంతం నుంచి ఎన్నికైన శాసనసభ్యులతోనే (కొత్తగా ఎన్నికలు జరపకుండా) ఆంధ్రరాష్ట్ర ప్రత్యేక ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. కర్నూలును రాజధానిగా చేసుకున్నారు. తరువాత కాలంలో ఆంధ్రరాష్ట్రం రాజధాని ఎక్కడుండాలనే దానిపై శాసనసభలో పెద్ద దుమారమే రేగింది. రాష్ట్రం మధ్యలోని విజయవాడ-గుంటూరు మధ్య రాజధానిని ఏర్పరచాలని కమ్యూనిస్టు పార్టీ తమ విధానంగా ప్రకటించింది. ఆ మేరకు కమ్యూనిస్టు శాసనసభా పక్షం విజయవాడ-గుంటూరు మధ్యనే రాజధాని ఏర్పాటు చేయాలని పట్టుపట్టింది. కానీ రాజధాని విషయంలో అధికార కాంగ్రెస్‌ శాసనసభా పక్షం చీలిపోయింది. ఆ పార్టీ శాసనసభ్యులు కొందరు విశాఖలో పెట్టాలని, మరికొందరు కర్నూల్లోనే ఉంచాలని ప్రాంతీయతత్వంతో చీలిపోయారు. అంతకుముందు విజయవాడ-గుంటూరు మధ్యనే రాజధాని ఏర్పాటు చేయాలనే విషయమై శాసనసభలో ఓటింగ్‌ జరిగింది. కమ్యూనిస్టులు ప్రతిపాదించిన విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని అంశమే నెగ్గింది. అయితే దీనికి అనేక భాష్యాలు తీసి చివరికి విశాఖలోనే పెట్టాలనే ప్రతిపాదనను కాంగ్రెస్‌ కొత్తగా ముందుకు తెచ్చింది. కాంగ్రెస్‌ వారితోపాటు మిత్రపక్షాలైన కృషికార్‌ లోక్‌ పార్టీ (కెఎల్‌పి), ప్రజాపార్టీ (పిపి) వంటివి మద్దతు పలికాయి. ఈ దశలో కాంగ్రెస్‌ వారు మధ్యంతర ఎన్నికలకు మొగ్గారు. ఫలితంగా 1957లో జరగాల్సిన ఎన్నికలు 1955లోనే జరిగాయి.
కమ్యూనిస్టు పార్టీకి 33 శాతం ఓట్లు.. 15 సీట్లు
1955 ఫిబ్రవరి 11న ఎన్నికలు జరిగాయి. 167 ఏకసభ్య నియోజకవర్గాలు, 29 ద్విసభ్య నియోజకవర్గాలు కలిపి 196 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 1952నాటి అనుభవాలతో ఉన్న కాంగ్రెస్‌ తనకు బలమైన సవాల్‌ విసిరిన కమ్యూనిస్టులను ఎలాగైనా ఓడించేందుకు కంకణం కట్టుకుంది. దుష్ప్రచారాలు, అల్లర్లు వంటి వాటితో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపొందింది. కృషికార్‌లోక్‌ పార్టీ (కెఎల్‌పి)ని, ప్రజా పార్టీ (పిపి)ని, ప్రజా సోషలిస్టు పార్టీ (పిఎస్‌పి)ని, స్వతంత్రులను తమ మిత్రులుగా చేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 142 స్థానాలకు పోటీ చేసి 119 స్థానాలు గెలుపొందింది. 39.35 శాతం ఓట్లను సంపాదించింది. కమ్యూనిస్టు పార్టీ ఎవరితోనూ పొత్తు లేకుండా 169 స్థానాలకు పోటీ చేసి 15 స్థానాల్లో విజయం సాధించింది. 31.13 శాతం ఓట్లు సంపాదించింది. ఈ రెండు పార్టీల మధ్య కేవలం 8 శాతం ఓట్లే తేడా ఉన్నా.. సీట్ల సంఖ్యలో భారీగా తేడా వచ్చింది.
వెల్లడైన ఎన్నికల లోపభూయిష్టత
ఎన్‌జి రంగా నేతృత్వంలోని కృషికార్‌ లోక్‌పార్టీ (కెఎల్‌పి) 37 స్థానాలకు పోటీ చేసి 22 స్థానాలను, 6,25,827 ఓట్లు (7.26 శాతం) సంపాదించింది. ఇక్కడే ప్రజాస్వామ్య ఎన్నికల విధాన లోపభూయిష్టతను వెల్లడిచేసింది. కేవలం 6 లక్షల 25 వేల ఓట్లు తెచ్చుకున్న కెఎల్‌పికి 22 స్థానాలు వచ్చి, 26 లక్షల 85 వేల ఓట్లు తెచ్చుకున్న కమ్యూనిస్టు పార్టీకి కేవలం 15 స్థానాలు మాత్రమే వచ్చాయి. ప్రజాస్వామ్యంలో మైనారిటీ ఓట్లతోకూడా మెజారిటీ ఓట్లు సంపాదించొచ్చని తేటతెల్లమైంది. ఇక ప్రజా సోషలిస్టు పార్టీ (పిఎస్‌పి) 45 స్థానాలకు పోటీ చేసి 13 స్థానాలను గెలుచుకుంది. ఈ పార్టీకి 4,81,666 ఓట్లు (5.58శాతం) వచ్చాయి. ప్రజా పార్టీ (పిపి) 12 స్థానాలకు పోటీ చేసి 5 సీట్లలో నెగ్గింది. 2,40,888 ఓట్లు (2.79 శాతం) సంపాదించింది. ఇండిపెండెంట్లు 177 స్థానాల్లో పోటీ చేశారు. 22 స్థానాల్లో గెలిచారు. 11,88,887 ఓట్లు (13.78శాతం) సాధించారు. భారతీయ జనసంఘం (నేటి బిజెపి)ఎన్నికల్లో ఎలాంటి ప్రభావమూ చూపలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో కృషికార్‌ లోక్‌పార్టీ, ప్రజా పార్టీ, ప్రజా సోషలిస్టు పార్టీలు ఎంతో ప్రభావం చూపాయి. కెఎల్‌పి పక్షాన గౌతు లచ్చన్న (సోంపేట), కొత్తపల్లి పున్నయ్య (మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి తండ్రి), పిఎస్‌పి పక్షాన కుసుం గజపతిరాజు, పూసపాటి విజయరామ గజపతిరాజు, కాంగ్రెస్‌ పక్షాన నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, వేముల కూర్మయ్య, పేట బాపయ్య, చల్లపల్లి రాజా, ఎంఆర్‌ అప్పారావు తదితర ప్రముఖులు గెలుపొందారు. కమ్యూనిస్టు పార్టీ పక్షాన ఆ పార్టీ అగ్ర నేత పుచ్చలపల్లి సుందరయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, వెల్లంకి విశ్వేశ్వరరావు, గుజ్జుల యల్లమందారెడ్డి తదితర నేతలు గెలుపొందారు.
ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాలరెడ్డి, ప్రతిపక్ష నేతగా పుచ్చలపల్లి సుందరయ్య
ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రిగానూ, పుచ్చలపల్లి సుందరయ్య ప్రతిపక్ష నాయకుడుగానూ ఎన్నికయ్యారు. 1955లో ఎన్నికలై ఏడాది గడిచాక 1956 నవంబరులో తెలంగాణాను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. దీంతో ఆంధ్ర రాష్ట్రం పేరును ‘ఆంధ్రప్రదేశ్‌’గా మార్చారు. ‘విశాలాంధ్ర’గా పేరు పెట్టాలని శాసనసభ్యులు హెచ్చుమంది పార్టీలకు అతీతంగా కోరినా కాంగ్రెస్‌ పార్టీ ‘ఆంధ్రప్రదేశ్‌’ అనే పేరు పెట్టడానికే మొగ్గు చూపింది. కారణం కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ ఏర్పాటు కావాలనే నినాదనం ఇవ్వడమే. భాషా ప్రాతిపదికగా పరిసర రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తెలుగువారందరినీ ఏకం చేసి రాష్ట్రం ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత కాంగ్రెస్‌ మళ్లీ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసింది. నీలం సంజీవరెడ్డి 1956 నవంబరు 1 నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈసారి కూడా పుచ్చలపల్లి సుందరయ్యే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. తెలంగాణకు చెందిన 85 ఏకసభ్య, 19 ద్విసభ్య శాసనసభ సీట్లను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. దీంతో 1957లో ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగమైన తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా ఎన్నికలు జరపాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో భాగమైన తెలంగాణాకు చెందిన శాసనసభ సీట్లు 104 అయ్యాయి. తెలంగాణ ప్రాంతానికి 1957లో ప్రత్యేకంగా ఎన్నికలు జరిపించాల్సి వచ్చినందున ఆ ప్రజా ప్రతినిధుల కాలపరిమితి ముగిసేవరకూ ఆగి 1962లో ఎన్నికలు జరిపారు. ఈ కారణంగా ఆంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధుల పదవీ కాలం మరో రెండేళ్లు కొనసాగింది.

➡️