జీతం పెంచి సమ్మె విరమింప చేయండి

Jan 18,2024 14:59 #Anganwadi strike, #vijayanagaram
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై .వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఏపీ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధ సంఘం) ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 38వ రోజు కు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సొకాష్ నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ నుంచి అయ్యన్నపేట ఐసిడిఎస్ ఆఫీసు వరకు అంగన్వాడీలు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం షోకాజ్ నోటీసులకు సమాధానాలు ఇచ్చారు. అంతకుముందు సమ్మె శిబిరం వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వర రావు అంగన్వాడీలో ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే గుర్తించ తగ్గ అంగన్వాడీల ఉద్యమం 38 రోజులుగా కొనసాగుతుందని కొనియాడారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలపై సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని, మహిళలని చూడకుండా ఎస్మా చట్టాన్ని ప్రయోగించిందని, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని నోటీసులు ఇచ్చిందని, మరోవైపు జిల్లా నేత రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అంగన్వాడీల ఉద్యమాన్ని వెనక్కుండి ఎవరో నడిపిస్తున్నారని ప్రకటించడంపై తీవ్రంగా మండిపడ్డారు. బొత్స అంటే మాకు గౌరవం ఉందని అధికారంలో ఉండి బాధ్యతారహితంగా మాట్లాడవద్దని హితవు పలికారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ నేత జగన్మోహన్ రెడ్డి ఉద్యమాల వద్దకు వచ్చి మద్దతు తెలియజేయలేదా అని గుర్తు చేశారు. అంగన్వాడీలు కడుపు మండి ఉద్యమిస్తున్నారు తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం లేద అన్నారు. పట్టుదలకు పోకుండా జీతం ఎంత పెంచుతారో చెప్పి సమ్మె ను విరమింపచేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మార్క్సిస్ట్ పార్టీ వామపక్ష , కలిసి వచ్చే ప్రతిపక్ష పార్టీలతో కలిసి రాష్ట్ర బంద్ కు సిద్ధం కావలసి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కే సురేష్, ఉపాధ్యక్షులు బి సుధారాణి, కార్యదర్శి ఏ .జగన్ మోహన్ రావు, యూనియన్ జిల్లా అధ్యక్షులు బి పైడ్రాజు నాయకులు ప్రభ, శివ, సుశీల ‌ తదితరులు పాల్గొన్నారు.

➡️