కొనసాగుతున్న రైతుల మార్చ్‌.. నేడు కేంద్రంతో మరోమారు చర్చలు

చండీగఢ్‌ :  రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ కొనసాగుతోంది. రైతులు ట్రాక్టర్‌, ట్రాలీలపై ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు సరిహద్దులను మూసివేశారు. పంజాబ్‌ -హర్యానా సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతులపై భద్రతా సిబ్బంది మధ్య నెలకొన్న ప్రతిష్టంభన మధ్య .. గురువారం కేంద్ర ప్రభుత్వం మూడోసారి రైతు సంఘాల నేతలతో చర్చలు జరపనుంది. వ్యవసాయ మంత్రి అర్జున్‌ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌, హోం వ్యవహారాల సహాయక మంత్రి నిత్యానంద రాయ్  గురువారం సాయంత్రం 5 గంటలకు రైతు నేతలతో సమావేశం కానున్నారు. ఫిబ్రవరి 8, 12 తేదీల్లో రైతులతో జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే.

పంజాబ్‌లో ‘ రైల్‌ రోకో ‘

కాగా, పంజాబ్‌లో భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఏక్తా ఉగ్రహన్‌), బికెయు దకౌండా (ధనేర్‌) గురువారం రైల్‌ రోకో ప్రకటించాయి. శంబు మరియు ఖనౌరీ సరిహద్దుల్లో హర్యానా భద్రతా సిబ్బంది టియర్‌గ్యాస్‌ షెల్స్‌ మరియు వాటర్‌ కెనాన్‌లను వినియోగించడాన్ని నిరసిస్తూ ఆ సంఘాలు రైల్‌రోకోకు పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఏడు ప్రాంతాలలో రైలు రోకో చేపట్టనున్నట్లు ప్రకటించాయి. అదే సమయంలో టోల్‌ ప్లాజాల వద్ద ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిరసనలు చేపట్టాలని సంయుక్త కిసాన్‌ మోర్చా నిర్ణయించింది.

➡️