టీమిండియాకు బిగ్‌ షాక్‌.. రెండో టెస్టుకు రాహుల్‌, జడేజా దూరం

Jan 29,2024 16:57 #Cricket, #Sports, #test match

ముంబయి: తొలి టెస్ట్‌లో ఓడిన షాక్‌లో ఉన్న టీమిండియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ వేదికగా ఫిబ్రవరి 2నుంచి ఇంగ్లండ్‌తో జరిగే రెండోటెస్ట్‌కు కెఎల్‌ రాహుల్‌తోపాటు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా దూరమయ్యారు. వీరిద్దరూ గాయాల బారినపడి విశాఖ టెస్ట్‌ ఆడడం లేదని బిసిసిఐ సోమవారం వెల్లడించింది. వీరి స్థానాల్లో ముగ్గురిని ఎంపిక చేసింది. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌తోపాటు వాషింగ్టన్‌ సుందర్‌, సౌరభ్‌ కుమార్‌ను బిసిసిఐ ఎంపిక చేసింది. తొలి టెస్టులో రన్నింగ్‌ చేస్తుండగా జడేజా మడమ కండరం పట్టేసింది. కెఎల్‌ రాహుల్‌కు తొడ కండరం నొప్పి రావడంతో విశ్రాంతి కావాలని కోరాడు. మా వైద్యబృందం ఎప్పటికప్పుడు ఇద్దరినీ పర్యవేక్షిస్తోంది. వారి స్థానంలో సెలక్షన్‌ కమిటీ ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసింది. సర్ఫరాజ్‌ ఖాన్‌, సౌరభ్‌కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌ను జట్టులోకి తీసుకుంది అని బిసిసిఐ ప్రకటించింది.

బుమ్రాకు ఒక డీ మెరిట్‌ పాయింట్‌

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్‌ పరుగుతీస్తుండగా.. భారత పేసర్‌ బుమ్రా ఉద్దేశపూర్వకంగా తగిలినట్లు ఐసిసి రిఫరీ నిర్ధరించారు. దీంతో ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ఆర్టికల్‌ 2.12 ప్రకారం బుమ్రా శిక్షార్హుడిగా ఐసిసి గుర్తించింది. గత 24 నెలల్లో బుమ్రా చేసిన తొలి నేరం కాబట్టి.. అతడి రికార్డులకు ఒక డీ మెరిట్‌ పాయింట్‌ను విధించింది. ఫీల్డ్‌ అంపైర్లు పాల్‌ రీఫిల్‌, క్రిస్‌ గఫానీ, థర్డ్‌ అంపైర్‌ మారియస్‌ ఎరాస్మస్‌, ఫోర్త్‌ అంపైర్‌ రోహన్‌ పండిత్‌ నిర్ణయం మేరకు మ్యాచ్‌ రిఫరీ శిక్షను ఖరారు చేశారు. తను చేసిన నేరాన్ని బుమ్రా అంగీకరించడంతో తదుపరి విచారణ అవసరం లేదని ఐసిసి స్పష్టంచేసింది.

రెండోటెస్ట్‌కు బిసిసిఐ ప్రకటించిన జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్‌, జైస్వాల్‌, శ్రేయస్‌, శ్రీకర్‌ భరత్‌, ధృవ్‌ జోరెల్‌(వికెట్‌ కీపర్లు), అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌, సిరాజ్‌, ముఖేశ్‌, బుమ్రా(వైస్‌ కెప్టెన్‌), ఆవేశ్‌ ఖాన్‌, రజత్‌ పటీధర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, సుందర్‌, సౌరభ్‌ కుమార్‌.

➡️