Brazil : ఇకపై జాత్యాహంకారాన్ని సహించేది లేదు

Mar 22,2024 17:28 #Brazilian President, #Racism

 బ్రసీలియా :    ఇకపై జాత్యాహంకారాన్ని సహించేది లేదని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డ సిల్వా పేర్కొన్నారు. దాన్ని ప్రపంచవ్యాప్తంగా పోరాటం చేయాల్సిన ‘రుగ్మత’గా అభివర్ణించారు. గురువారం బ్రెజిల్‌లోని నల్లజాతి యువతకు మద్దతుగా ప్రవేశపెట్టిన నూతన పథకాలను ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా విద్య, ఆరోగ్యం, సంస్కృతి, క్రీడలలో వారిని ప్రోత్సహిస్తామని అన్నారు. సామాజిక భద్రత కూడా కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు.

జాత్యాహంకారాన్ని పూర్తిగా నిర్మూలించాలని పేర్కొన్నారు. ప్రతి రోజూ నల్లజాతీయులు పలు మానవ హక్కుల ఉల్లంఘనల బాధితులుగా మారుతున్నారని, ఇకపై దాన్ని సహించబోమని అన్నారు. ఇకపై నల్ల జాతీయులను చూసినపుడు రంగు గుర్తుకు రాకూడదని, ఓ వ్యక్తిగా గుర్తించాలని అన్నారు. అతనిలో ఆశయాలు, భావాలు కలిగిన వ్యక్తిగా, గౌరవంగా జీవించాలని కోరుకునే వ్యక్తిగా చూడాలని అన్నారు.

దేశంలో ఏదోఒక చోట వారి రంగు కారణంగా హింసించబడుతున్నారని అన్నారు. పేద కమ్యూనిటీకి చెందిన వారు బుల్లెట్‌ బాధితులుగా మిగులుతున్నారని అన్నారు. ఇది సాధారణమని భావించలేమని, నిర్మూలించాల్సిందేనని స్పష్టం చేశారు. జాత్యాహంకార చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించేది లేదని చెప్పారు. తన దేశంలో మరింత సామాజిక న్యాయం, తక్కువ అసమానత, వివక్ష లేకుండా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా ప్రముఖ బ్రెజిల్‌ ఫుట్‌ బాల్‌ క్రీడాకారుడు, ప్రపంచ క్లబ్‌లలో ఆడుతున్న విన్సియస్‌ జూనియర్‌ రంగు కారణంగా వివక్షను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇది ప్రపంచ సమస్య అని కేవలం ఒక్క దేశానికే పరిమితం కాలేదని పేర్కొన్నారు.

➡️