RTI Act: ఆ సమాచారం అందుబాటులో లేదు : రాష్ట్రపతి భవన్‌

న్యూఢిల్లీ :   ఏ ఫైల్స్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పున:పరిశీలన కోసం తిరిగి పంపారనే సమాచారం అందుబాటులో లేదని రాష్ట్రపతి భవన్‌ మంగళవారం ఆర్‌టిఐ ప్రశ్నకి సమాధానమిచ్చింది. సమాచార హక్కు చట్టం, 2005 కింద తమిళనాడుకి చెందిన రాజ్‌ కపిల్‌ ఓ పిటిషన్‌ దాఖలు చేశారు.

ప్రధాని, కేబినెట్‌, కేబినెట్‌ నియామకాల కమిటీ (ఎసిసి), పార్లమెంట్‌, కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ఏజన్సీలు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతి ఎన్నిసార్లు తిరిగి పంపారో తెలియజేయాలని పిటిషన్‌లో కోరారు. రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతి తిరిగి సమీక్షించాలని ఎన్నిసార్లు తిప్పిపంపారో కూడా తెలియజేయాలని కోరారు. అటువంటి సమాచారం అందుబాటులో లేదని రాష్ట్రపతి భవన్‌ డైరెక్టర్‌ శివేంద్ర చతుర్వేది సమాధానమిచ్చారు.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాతాలకు చెందిన రికార్డుల సంరక్షకుడు, నోడల్‌ శాఖగా వ్యవహరించే కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆన్‌లైన్‌లో ఆర్‌టిఐ పిటిషన్‌ను బదిలీ చేసినట్లు చతుర్వేది తెలిపారు. ఈ సమాధానం పట్ల సంతృప్తి చెందకపోయినట్లైతే పిటిషనర్‌ నెలరోజుల లోపు ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ /అప్పీలేట్‌ అథారిటీ ముందు చట్టంలోని సెక్షన్‌ 19(1) కింద అప్పీల్‌ చేయవచ్చని పేర్కొన్నారు.

రాష్ట్రపతి భవన్‌ నుండి వచ్చిన సమాధానంపై తాను దిగ్భ్రాంతికి గురయ్యానని తాను ఆశ్చర్యపోయానని క్రిమినాలజీలో లెక్చరర్‌ అయిన మిస్టర్‌ రాజ్‌ కపిల్‌ పేర్కొన్నారు. ప్రధాని, కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతి పున:పరిశీలనకు పంపినట్లు ధృవీకరించలేదు లేదా తిరస్కరించలేదని అన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ఫైల్స్‌, నిర్ణయాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంరక్షకుడిగా ఉన్నప్పటికీ.. ఆర్‌టిఐ చట్టం కింద రాష్ట్రపతి భవన్‌ ఏ ప్రాతిపదికన సమాధానం ఇవ్వలేదని అన్నారు.

అటువంటి సమాచారం అందుబాటులో లేదని చెప్పడం అసంపూర్ణమైన, తప్పుదారి పట్టించే సమాధానం. రాష్ట్రపతి రాజ్యాంగ పనితీరులో మాత్రమే కాకుండా వ్యవస్థలో జవాబుదారీ తనం, పారదర్శకతను నిర్థారించడంలో కీలక వ్యక్తి అని, అటువంటప్పుడు రాష్ట్రపతి భవన్‌లో డేటా ఎలా ఉండదని ప్రశ్నించారు.

గతంలోనూ ఇదేవిధమైన ప్రతిస్పందన
గతంలోనూ ఆర్‌టిఐ కింద దాఖలైన పిటిషన్‌కు రాష్ట్రపతి భవనన్‌ ఇదే విధమైన సమాధానమివ్వడం గమనార్హం. ప్రధాని, కేబినెట్‌ నిర్ణయాలను అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎన్నిసార్లు పున:పరిశీలన కోసం పంపారో ఆర్‌టిఐ కింద సమాధానమివ్వాలని చెన్నైకి చెందిన ఓ విద్యార్థి కోరారు. ఆ పిటిషన్‌కు కూడా రాష్ట్రపతి భవన్‌ నుండి ఇదే విధమైన ప్రతిస్పందన వచ్చింది. విద్యార్థి, యువన్‌ మిత్రన్‌, ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

➡️