మోడీ ప్రభుత్వంలో ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం

Nov 18,2023 23:02 #nandyala

మోడీ ప్రభుత్వంలో ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం
– సనాతన ధర్మం పేరిట మహిళలను వంటింటి కుందేలుగా మారుస్తోంది
– మహిళా సమాఖ్య జాతీయ కార్యదర్శి డాక్టర్‌ శాంతి
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలోకి ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని తీసుకువస్తుందని, సనాతన ధర్మం పేరిట మహిళలను వంటింటి కుందేలుగా మారుస్తోందని మహిళా సమాఖ్య జాతీయ కార్యదర్శి డాక్టర్‌ శాంతి పేర్కొన్నారు. నంద్యాలలో జరుగుతున్న ఎపి మహిళా సమాఖ్య 15వ రాష్ట్ర మహాసభలను రెండవ రోజు శనివారం కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభించారు. ముందుగా సీనియర్‌ జాతీయ నాయకురాలు డాక్టర్‌ సంజీవమ్మ జెండావిష్కరణ చేశారు. రాష్ట్ర నాయకురాలు నక్కి బాలమ్మ అమర వీరుల స్థూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ప్రతినిధుల సభకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి అధ్యక్షత వహించారు. మహాసభకు ముఖ్యతిధిగా మహిళా సంఘం జాతీయ కార్యదర్శి డాక్టర్‌ శాంతి హాజరై మాట్లాడారు. ఇటీవల మణిపూర్లో మహిళలపై జరిగిన అఘాయిత్యాలకు జాతి మొత్తం సిగ్గు పడిందన్నారు. బాలికల పెళ్లి వయసును కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాల నుండి 21 సంవత్స రాలు పెంచిందని, అయితే 18 సంవత్స రాలలోపు బాల్యవివాహాలనే అరికట్టలేక పోతుం దని విమ ర్శించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను పార్లమెంటులో చట్టం చేయడం మంచిదేనని, అయితే మహిళా రిజర్వేషన్‌ బిల్లు కేవలం ఎన్నికల్లో లబ్ది కోసమేనని విమర్శించారు. అనంతరం మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి దుర్గ భవాని, జాతీయ నాయకురాలు అక్కినేని వనజ తదితరులు మాట్లాడారు. ఈ మహాసభలో అరుణ, మహిళా సమాఖ్య వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విమల, సంధ్య కుమారి, యామిని, మహిళా సమాఖ్య నాయకులు విమల, బషీరునిసా, సుగుణమ్మ, రాణి, వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️