Stalin : బిజెపితో పొత్తుతో పుదుచ్చేరికి ఎలాంటి ప్రయోజనం లేదు

పుదుచ్చేరి : పుదుచ్చేరి పాలక పార్టీ ఎఐఎన్‌ఆర్‌సి, బిజెపితో పొత్తుతో పుదుచ్చేరికి ఎలాంటి ప్రయోజనం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే.. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తామని స్పష్టం చేశారు. బిజెపితో పొత్తుతో పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌. రంగసామి రాష్ట్ర హోదా, పాలనా హక్కుల విషయంలో రాజీపడ్డారని అన్నారు. పుదుచ్చేరి లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి వి. వైతిలింగంకు మద్దతుగా ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో స్టాలిన్‌ పాల్గన్నారు.
ఈ సందర్భంగా స్టాలిన్‌ మాట్లాడుతూ.. రంగసామి పూర్తిగా బిజెపికి, కేంద్ర ప్రభుత్వానికి లంగిపోయారని, ఆయన బిజెపికి ‘డమ్మీ’గా మిగిలారని అన్నారు. గత మూడేళ్లగా రాష్ట్ర హోదాపై మాట్లాడలేదని మండిపడ్డారు. లోక్‌సభ స్థానాన్ని కూడా ఆయన జూనియర్‌ భాగస్వామి అయిన బిజెపికి అప్పగించారని దుయ్యబట్టారు. బిజెపితో పొత్తుతో పుదుచ్చేరికి ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. రంగసామి తన సౌలభ్యం కోసం రాష్ట్రహోదా అంశాన్ని లేవనెత్తుతారని అన్నారు.
కేంద్రంలో ఇండియా ఫోరం అధికారంలోకి వస్తే మైనారిటీ వర్గాలను ప్రభావితం చేసే అన్ని చట్టాలను రద్దు చేస్తామని అన్నారు. పదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న మోడీ తన ప్రసాంగాల్లో మతపరమైన అంశాలను మాత్రమే ప్రస్తావించడం ఖండించాల్సిన అంశమని అన్నారు. తాను ఒబిసి చెప్పుకునే ప్రధాని ఎప్పుడూ కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడలేదని అన్నారు

➡️