ప్రజారోగ్యాన్ని హక్కుగా చట్టం చేయాలి

– ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు
ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :ప్రజారోగ్యాన్ని హక్కుగా ప్రభుత్వం చట్టం చేయాలని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రజారోగ్య వేదిక, ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ సంయుక్తంగా రాజకీయ పార్టీలకు ‘ప్రజా ఆరోగ్యం ప్రభుత్వాల బాధ్యత’ అంటూ బహిరంగ లేఖ రాసినట్టు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సూచీలో ఆరోగ్యానికి ఖర్చు పెట్టడంలో భారతదేశం 111 స్థానంలో ఉందని తెలిపారు. రోజురోజుకూ నిరుపేదలు పెరిగిపోతున్నారని, పౌష్టికాహార లోపం, తాగునీటి కొరత, తదితర కారణాలతో రోగాలు ప్రబలుతున్నాయని, అరికట్టే బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ రాష్ట్ర నాయకులు కెవిపి.చంద్రమౌళి మాట్లాడుతూ ఆర్టికల్‌ 21 ప్రకారం ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించే హక్కును కలిగి ఉన్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వాలు విస్మరించడం దారుణమన్నారు. ఆర్థిక విధానాలు కొందరికే మేలు చేసేలా ఉండటం, ఉద్యోగ భద్రత కరువవడం వంటివి కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. హెల్త్‌ డిపార్టుమెంట్‌లో ఉద్యోగులందరినీ పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా కన్వీనర్‌ సుధాకర్‌ పాల్గొన్నారు.

➡️