నిరసనలు.. నిలదీతలు..!

పొత్తుల నేపథ్యంలో ప్రతిపక్ష టిడిపిలో నిరసనల పర్వం కొనసాగుతుండగా.. సమస్యలపై అధికార పార్టీ అభ్యర్థులకు ప్రజల నుంచి నిలదీతలు తప్పడం లేదు. ఇక ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వాలంటీర్ల రాజీనామాల పర్వం కొనసాగుతుండగా ఇంటర్‌ ఫలితాల్లో రెండు జిల్లాల్లోనూ మళ్లీ బాలికలే ఆధిపత్యం కనబరిచారు. టిడిపి ఉండి ఎంఎల్‌ఎ అభ్యర్థి మార్పు అంశం ఆ పార్టీలో చిచ్చురేపింది. సాక్షాత్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు కాన్వారును అడ్డుకోవడం, జిల్లా అధ్యక్షురాలు ఇంటిని ముట్టడించడం, ఆమరణ నిరాహారదీక్షకు దిగడం తెలుగు తమ్ముళ్లలో నెలకొన్న ఆగ్రహావేశాలను ప్రతిబింబిస్తోంది. ఇప్పటికే శివ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడంతో ఆ పార్టీ రెండుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. ఇక రఘురామ ఎంట్రీతో ఉండి నియోజకవర్గంలో టిడిపి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు. రఘురామ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగినా, ఉండి ఎంఎల్‌ఎ అభ్యర్థిగా బరిలోకి దిగినా టిడిపి శ్రేణుల నుంచి సహకారం ఏమేరకు ఉంటుందో వేచిచూడాల్సిందే. ప్రధానంగా ఆమరణ నిరాహారదీక్షలనుద్దేశించి, మంతెన రామరాజునుద్దేశించి తన సహాజ శైలిలో చేసిన విమర్శలు తెలుగుతమ్ముళ్లను రగిలిస్తున్నాయి. ఈ క్రమంలో ఉండి ఎంఎల్‌ఎ స్థానం నుంచి బరిలోకి దిగే కూటమి అభ్యర్థికి తెలుగు తమ్ముళ్ల మద్దతు కష్టమని, శివకు మద్దతు పలికే అవకాశం ఉందని, అదే సమయంలో ఎంపీ అభ్యర్థిగా రఘురామబరిలో ఉంటే అక్కడా వ్యతిరేకంగానే పని చేసే అవకాశం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా రోజుకో రీతిన మలుపులు తిరుగుతున్న ‘ఉండి’ రాజకీయం నామినేషన్ల పర్వం ముగిసేనాటికి ఎలా మారుతుందో వేచిచూడాలి. ఇక అధికారపక్షం వైసిపి కూడా నూజివీడు, పోలవరం నియోజకవర్గాలతో పాటు పలుచోట్ల ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆసరా సొమ్ము ఇంకా తమ ఖాతాల్లో పడలేదని, బటన్‌ నొక్కినా డబ్బు రాకపోవడం ఏమిటంటూ ప్రశ్నిస్తుంటే అభ్యర్థులు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు. ఇక పోలవరం నియోజకవర్గంలోని టి.నర్సాపురం మండలంలోని కృష్ణాపురం ప్రజలు ఎన్నికలప్పుడే మేము గుర్తొస్తామా అని వైసిపి ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజును నిలదీయడం విశేషం. ఈ రెండు చోట్లే కాకుండా రోడ్లు, స్థానిక సమస్యలతోపాటు జగనన్న కాలనీల్లో సమస్యలు, పథకాల సొమ్ము పూర్తిగా అందకపోవడంపై ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రోడ్ల ప్యాచ్‌ వర్క్‌లు సాగుతున్నాయిగా.. సొమ్ములు పడతాయి అంటూ అభ్యర్థులు సమాధానం చెప్పి ముందుకు సాగుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే నామినేషన్ల పర్వం పూర్తయ్యాక ప్రజల నుంచి ఎదురయ్యే నిరసనలు ఎలా ఎదుర్కోవాలా అనే దానిపై అధికార పార్టీ నేతలు మల్లగుల్లలు పడుతున్నారు. ఏదేమైనా ఇటు అధికారపక్షం ప్రజల నుంచి, ప్రతిపక్షం సొంత పార్టీ నేతల నుంచి నిరసనలు, నిలదీతలు ఎదుర్కోవాల్సి రావడంతో జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -విఎస్‌ఎస్‌వి.ప్రసాద్‌

➡️