రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే హక్కులకు రక్షణ

Nov 22,2023 22:10 #dalitha, #sadassu

-2024లో బిజెపిని ఓడిస్తేనే దేశ మనుగడ
– ఉద్యమాల ద్వారానే దళిత, గిరిజనులకు సమానత్వం
– దళిత హక్కుల రక్షణ, సామాజిక న్యాయం కోసం’ రాష్ట్ర సదస్సులో వక్తలు
ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో:’డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రచించిన భారత రాజ్యాంగానికి, దళిత, గిరిజనులకు, మహిళలకు, సామాజిక తరగతుల హక్కులకు గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో కనీస రక్షణ కరువైంది. అందరం ఐక్యమై రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే హక్కులకు రక్షణ లభిస్తుంది’ అని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. దేశంలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని, మోడీని ఓడిస్తేనే దేశానికి మనుగడ, దళిత, గిరిజనుల హక్కులను రక్షణ అని స్పష్టం చేశారు. అందుకోసం జరిగే పోరాటాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘రాజ్యాంగం కల్పించిన దళిత హక్కుల రక్షణ, సామాజిక న్యాయం కోసం’ రాష్ట్ర స్థాయి సదస్సు విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగింది. కెవిపిఎస్‌, డిహెచ్‌పిఎస్‌, ఎఐఎడబ్ల్యుయు, ఎఐఆర్‌ఎల్‌ఎ, డిబిఎస్‌యు, డిబిఎఫ్‌, పిఎంసి వంటి సామాజిక, ప్రజాసంఘాల రాష్ట్ర కమిటీలు ఈ సదస్సు నిర్వహించాయి. ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ (సిడిఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షులు మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో దళితులు, గిరిజనులు నేటికీ వారి కష్టాల నుంచి బయటకు రాలేకపోయారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో యువతకు ఉపాధి కరువైందన్నారు. దేశంలో అదానీ, అంబానీ, టాటాల ఆస్తులు విపరీతంగా పెరిగాయని, ప్రజల డబ్బులో 80 శాతం బడా వ్యక్తుల వద్దే ఉందని తెలిపారు. దేశ సంపద, వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు, సేవా రంగాల్లో దళిత, గిరిజనుల శ్రమ దాగి ఉందన్నారు. నేటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు ఉద్యమం, దళిత ఉద్యమం రెండూ అత్యంత అవసరమని పేర్కొన్నారు.
దళిత శోషణ్‌ ముక్తి మంచ్‌ (డిఎస్‌ఎంఎం) జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ దళిత, గిరిజన హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ నినాదంతో డిసెంబర్‌ 4న ఛలో ఢిల్లీ కార్యక్రమం 150 సామాజిక, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యాన జరగనుందని తెలిపారు. దీనిని జయప్రదం చేయాలని కోరారు. ప్రస్తుత ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపిని సాగనంపితే 2024 ఎన్నికల్లో దేశానికి శుభం కలుగుతుందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర పాలకులు ప్రభుత్వ పథకాలకు తమ పేర్లు పెట్టుకోవడం ఒక పిచ్చిగా మారిందన్నారు. అహ్మదాబాద్‌ స్టేడియం పేరును నరేంద్ర మోడీ స్టేడియంగా మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో విదేశీ విద్యకు డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విదేశీ విద్యా పథకం అని ఉండగా, జగనన్న విద్యా దీవెనగా మార్చడం దారుణమన్నారు. చంద్రయాన్‌కు కూడా మతం రంగు పులిమి ‘శివశక్తి’ అని మార్చారని, నిజానికి ఆ ల్యాండర్‌కు విక్రమ్‌ సారాబాయి పేరు ఉండేదని తెలిపారు. పార్లమెంట్‌లో అంబేద్కర్‌ ఫొటో పెట్టానని మోడీ గొప్పలు చెబుతున్నారని, అదే పార్లమెంట్‌ హాలులో దళిత, గిరిజన హక్కులను కాలరాసే శాసనాలను ఎన్నో చేశారని గుర్తు చేశారు.
ఎఐఎడబ్ల్యుయు జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ దేశంలో బిజెపిని ఒంటరి చేసి ఓడించే శక్తులన్నీ ఏకం కావాల్సి ఉందన్నారు. గతంలో దళిత, గిరిజన హక్కులను కనీసం ప్రభుత్వాలు గుర్తించేవని, నేడు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వాటిని గుర్తించడానికి సైతం నిరాకరిస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ రంగాన్ని అమ్మేస్తోందన్నారు. ఎఐడిఆర్‌ఎం జాతీయ అధ్యక్షులు ఎ.రామ్మూర్తి మాట్లాడుతూ దేశంలో 25 శాతం ఉన్న దళితులు రానున్న రోజుల్లో బిజెపి వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని కోరారు. సదస్సులో డిబిఎస్‌యు వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వినరు, రాష్ట్ర అధ్యక్షులు పి.చిట్టిబాబు, బికెఎంయు జాతీయ ఉపాధ్యక్షులు ఆవుల శేఖర్‌, ఆర్‌పిఐ (ఎ) జాతీయ ఉపాధ్యక్షులు బడ్డు కల్యాణరావు, డిహెచ్‌పిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు జెవి.ప్రభాకరరావు, సిఐటియు విశాఖ జిల్లా నాయకులు ఎం.జగ్గునాయుడు తదితరులు పాల్గొన్నారు.
పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ సాగిస్తోన్న దాడులు, యుద్ధంపై ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.లోకనాథం, దళిత, గిరిజనుల హక్కుల రక్షణపైనా, వారిపై దాడులకు వ్యతిరేకంగా కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి ప్రవేశపెట్టిన తీర్మానాలను సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది.

➡️