ప్రజల ఆరోగ్య రక్షణ ప్రభుత్వాల బాధ్యత

Apr 10,2024 22:10

 ప్రజాశక్తి – హెల్త్‌ యూనివర్శిటీ : ప్రజల ఆరోగ్య రక్షణ ప్రభుత్వాల బాధ్యత అని, బాధ్యతతో పాటు, ఆహారం, అలవాట్లు, వ్యాయామం, నిద్ర విషయంలో ప్రజలు కూడా శ్రద్ద వహించాలని అపుడే వ్యక్తి ఆరోగ్యం చక్కగా ఉంటుందని ప్రముఖ ఫిజీషియన్‌ డాక్టర్‌ పి.గురుప్రసాద్‌ అన్నారు. బెంజిసర్కిల్‌ వద్ద గల వాసవ్య నర్సింగ్‌ హౌమ్‌లో ‘నా ఆరోగ్యం – నా హక్కు’ అనే అంశంపై బుధవారం డాక్టర్‌ సమరం అధ్యక్షతన ఆరోగ్య సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న డాక్టర్‌ గురు ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వాలు వ్యాధి నిరోధక టీకాలు, అంటు వ్యాధులు, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య విద్య గురించి అన్ని స్థాయిల్లోనూ బాద్యత వహించాలన్నారు. ప్రజలకు కావాల్సిన అత్యవసర మందులు, వ్యాధులకి సంబంధించిన పరీక్షలు, చికిత్సలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ఆహార పదార్థాల కల్తీ గురించి శ్రద్ద వహించాలన్నారు. ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగం, వాటి వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియచేయడమే కాకుండా వాటి నిషేదానికి కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్య రక్షణ ప్రభుత్వంబాద్యత అన్నారు. ఆ బాద్యతను విస్మరిస్తే జాతి ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు. ఈకార్యక్రమంలో డాక్టర్‌ మారు పాల్గొన్నారు.

➡️