ప్రతిపాదనలు ఘనం… పెట్టుబడులు స్వల్పం

Dec 14,2023 09:15 #Investments, #Jammu and Kashmir
proposals more investments low jammu kashmir

జమ్మూకాశ్మీర్‌ పరిస్థితిపై వాస్తవాలు కప్పిపెడుతున్న కేంద్రం

శ్రీనగర్‌ : ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానానికి ఓ విషయాన్ని తెలియజేసింది. ఈ అధికరణ జమ్మూకాశ్మీర్‌ అభివృద్ధికి, పురోగతికి అవరోధంగా ఉన్నదని చెప్పింది. దీనిని రద్దు చేయాలని 2019 ఆగస్ట్‌ ఐదున పార్లమెంట్‌ నిర్ణయం తీసుకున్న తర్వాతే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం మొదలైందని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వ వాదనలో ఏ మాత్రం వాస్తవం లేదని గణాంకాలు రుజువు చేస్తున్నాయి.

జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వం 2021 జనవరిలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. గత మూడు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం 42 పారిశ్రామిక రంగాలలో రూ.84,544 కోట్ల విలువైన ప్రతిపాదనలు అందుకుంది. అయితే వీటిలో కార్యరూపం దాల్చినవి చాలా తక్కువ. ఇప్పటి వరకూ జమ్మూలో 266, కాశ్మీర్‌లో 148… మొత్తం 414 యూనిట్లు నమోదయ్యాయి. వీటి ద్వారా వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.2,518 కోట్లు మాత్రమే. జమ్మూకాశ్మీర్‌లో అతిథ్య రంగం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ అక్కడ హోటళ్ల ఏర్పాటుకు ఇప్పటి వరకూ కేవలం రూ.87 కోట్ల విలువ కలిగిన ప్రతిపాదనలు మాత్రమే వచ్చాయి. భూ సమస్య కారణంగా ఆశించిన స్థాయిలో పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

జీ-20 సదస్సు సందర్భంగా దేశానికి వచ్చిన విదేశీ ప్రతినిధులను ప్రభుత్వం కాశ్మీర్‌కు తీసికెళ్లి అక్కడ పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతగా అవకాశాలు ఉన్నాయో వివరించింది. అయినప్పటికీ ఆశించిన ఫలితం చేకూరలేదు. వాస్తవాలు ఇలా ఉంటే సుప్రీంకోర్టులో సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చేసిన వాదన మరోలా ఉంది. ‘తాము ఏమి కోల్పోయామో ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి. పోలీస్‌ వ్యవస్థ కేంద్రం అధీనంలో ఉండడంతో టూరిజం మొదలైంది. 16 లక్షల మంది పర్యాటకులు వచ్చారు’ అని ఆయన చెప్పుకొచ్చారు.

విలువకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనల్లో 60% జమ్మూకు చెందినవి కాగా మిగిలినవి కాశ్మీర్‌కు చెందినవి. కానీ సంఖ్యాపరంగా చూస్తే జమ్మూకు 1,551 ప్రతిపాదనలు, కాశ్మీర్‌కు 4,566 ప్రాతిపాదనలు వచ్చాయి. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. పెట్టుబడులకు సంబంధించి రూ.28,400 కోట్ల కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక పథకం ఇప్పటికే తన కోటాను పూర్తి చేసుకుంది. ఈ ప్రోత్సాహక పథకంలో అదనంగా రూ.75 వేల కోట్లు చేర్చాలన్న ప్రతిపాదన కేంద్రం వద్ద సంవత్సర కాలంగా పెండింగ్‌లో ఉంది.

పెట్టుబడిదారులకు అందజేసేందుకు జమ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వ భూములేవీ ఖాళీగా లేవు. భూసేకరణ కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ అందుకు కొంత సమయం పడుతుంది. జమ్మూకాశ్మీర్‌లో జేఎస్‌డబ్ల్యూ, హెచ్‌ఎఫ్‌సీఎల్‌ వంటి కొన్ని బడా కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయి. ప్రారంభంలో అపోలో హాస్పిటల్స్‌ కొంత ఆసక్తి చూపినప్పటికీ ఆ తర్వాత వెనకడుగు వేసింది.

➡️