కంపెనీకి లాభాలు.. కార్మికులకు నష్టాలు..

Apr 5,2024 23:08
కంపెనీకి లాభాలు.. కార్మికులకు నష్టాలు..

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి కంపెనీ యాజమాన్యానికి లాభాలు, కార్మికులకు నష్టాలకు ఆంధ్రా పేపర్‌ లిమిటెడ్‌ వేదికగా మారింది. తూర్పు గోదావరి జిల్లాలో భారీ పరిశ్రమల్లో ఒకటైన ఎపి పేపరు మిల్లులో కార్మిక చట్టాలకు యథేచ్ఛగా తూట్లు పడుతున్నాయి. అయినప్పటికీ ఉన్నతాధికారులు కనీస జోక్యం చేసుకోకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఎపి పేపర్‌ మిల్లు యాజమాన్యం 2017లో కార్మికులతో చేసిన వేతన ఒప్పందం 2020 జూన్‌తో ముగిసిన విషయం విదితమే. గడిచిన నాలుగేళ్లలో ప్రతి ఏటా రూ.200 కోట్ల చొప్పున సుమారు రూ.800 కోట్లు పైగా లాభాలు ఆర్జించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. చట్టరీత్యా కార్మికులకు వేతన ఒప్పందం చేయకపోవడంతో గడిచిన నాలుగేళ్లలో కార్మికులకు అక్షరాలా సుమారు రూ.40 కోట్ల మొండి చేయి చూపించింది. ఇప్పటికైనా వేతన ఒప్పందం చేయాలని వేడుకుంటున్నా అప్రజాస్వామికంగా వ్యవహరించడం ఆ సంస్థ నిరంకుశత్వాన్ని దర్పణం పడుతోంది. వేతన ఒప్పందం చేసుకోవాలని కార్మిక శాఖ అధికారులు సూచించినప్పటికీ యాజమాన్యం ముందుకు రాకపోవటంతో కార్మికులు సమ్మెబాట పట్టారు. నేటితో నిరవధిక సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. సుమారు 2500 మంది కార్మికులు ఐక్యంగా 11 సంఘాలుగా చేపట్టిన ఈ ఆందోళనలపై అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నేతలు ఉలుకూ పలుకూ లేకపోవటం జిల్లా ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. కార్మికులు చేపట్టిన ఆందోళనలకు వామపక్ష పార్టీలు, కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు తెలిపాయి.నాలుగో రోజుకు చేరిన సమ్మెఈ నెల 2న చేపట్టిన సమె నాలుగో రోజుకు చేరుకుంది. పేపరు మిల్లు యాజమాన్యం అవలంభిస్తున్న నిరంకుశ విధానాలపై కొంత కాలంగా కార్మిక సంఘాలు ఆందోళన తెలుపుతున్నాయి. గుర్తింపు సంఘం యాజమాన్యంతో వేతన ఒప్పందం, ఇతర సమస్యల చర్చలు జరిపి ఒప్పందానికి వస్తుంది. వేతన ఒప్పందం ప్రతి 3 1/2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. నాలుగేళ్లుగా ఎన్నికలు జరగకపోవడంతో పర్మినెంట్‌ కార్మికుల నూతన వేతన ఒప్పందం కూడా పెండింగ్‌లో ఉండి పోయింది. పాత వేతన ఒప్పందం 2020 జూన్‌లో పూర్తయ్యింది. నాలుగేళ్లు గడిచినా కొత్త వేతన ఒప్పందం జరగక పోవడంతో ఒక్కో కార్మికునికి నెలకు రూ.11,000 చొప్పున 700 మందికి నెలకు రూ.77 లక్షలు గడిచిన నాలుగు సంవత్సరాల్లో రూ.36.96 కోట్లు నష్టపోయారు. 2020 జనవది, ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ కోసం ప్రక్రియ ప్రారంభించారు, కోవిడ్‌ వ్యాప్తిని సాకుగా చూపి ఎన్నికలు వాయిదా వేశారు. తాజాగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ యాజమాన్యం ముందుకు రాకపోవడం విమర్శలకు దారితీస్తోంది. పేపరు మిల్లు యాజమాన్యం కార్మిక చట్టాల ఉల్లంఘనకు వేతన ఒప్పందం ఒక ఉదాహరణ మాత్రమే. కార్మికుల తొలగింపులు, పరంపర పేరుతో ఉద్యోగాలు కల్పన, ఉత్పత్తి విభాగంలోనూ కాంట్రాక్టు కార్మికులతో భర్తీ వంటివి అనేకంఉన్నాయి.ఉలుకూ, పలుకూ లేని టిడిపి, వైసిపితాజాగా 2024 సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన విషయం విదితమే. పేపరు మిల్లులో పని చేసే కార్మికులు రాజమహేంద్రవరం నగరం, రూరల్‌, రాజానగరం నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావం చేయగలరు. గతంలో ఇక్కడ కార్మిక సంఘాలలో కీలకంగా పనిచేసిన వారు క్రియాశీల రాజకీయాల్లోనూ రాణించారు. అటువంటి పోరాట చరిత్ర పేపరు మిల్లు కార్మికుల సొంతం. ఆంధ్రా పేపర్‌ మిల్‌లో రాజమండ్రి విభాగంలో 700 మంది పర్మినెంట్‌ కార్మికులు, 1300 మంది కాంట్రాక్టు కార్మికులు (కార్డ్‌ హోల్డర్స్‌) మరో 1000మంది కార్డ్‌ లేని కాంట్రాక్టు కార్మికులు మొత్తం కలిపి సుమారుగా 3000 మంది పని చేస్తున్నారు. కడియం విభాగంలో పర్మినెంట్‌ కార్మికులు 300 మంది, ట్రైనీలు 130 మంది, కాంట్రాక్టు కార్మికులు దాదాపు 900 మంది ఉన్నారు. కార్మికులు వారి కుటుంబాలు, బంధువులు, స్నేహితులతో పాటు ఇతర కార్మిక సంఘాలను ఐక్యం చేస్తే అభ్యర్థుల తలరాతలు మారతాయని స్పష్టమవుతోంది. ఈ నేపధ్యంలో అధికార, విపక్ష పార్టీల నేతలు ఇప్పటికైనా స్పందించి కార్మికులకు మద్దతు తెలపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

➡️