అసలైన హీరో నువ్వే…

Feb 18,2024 10:06 #Actors, #Film Industry, #Profiles
profile 12th failure movie hero Vikrant Massey

ప్రతి ఏటా ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి. అలాంటి చిత్రాల్లో హిందీ సినిమా ’12th ఫెయిల్‌’ ఒకటి. అందుకు కారణం కథ, అందులో నటించిన నటీనటులు. హీరో విక్రాంత్‌ మాస్సే- మనోజ్‌ పాత్రలో నటించారు అనే కంటే జీవించారు అంటేనే బాగుంటుంది. హిందీనే అయినా సినిమా చూసిన ప్రతి ఒక్కర్నీ భావోద్వేగానికి గురిచేశారంటే ఆయన నటన ఎంత అద్భుతంగా ఉందో ఊహించవచ్చు. అందుకే ఈ సినిమాకుగానూ ఆయనకు ‘ఉత్తమ నటుడు’గా అవార్డు వరించింది. ఈ సందర్భంగా విక్రాంత్‌ మాస్సే గురించి కొన్ని విశేషాలు..

విక్రాంత్‌ మాస్సే తల్లితండ్రులు జాలీ, ఆమ్నాలు. ఒక అన్నయ్య మొహ్సిన్‌ ఉన్నారు. తండ్రి కుటుంబం క్రైస్తవ మతానికి చెందినది. తల్లి కుటుంబం సిక్కు మతానికి చెందినది. విక్రాంత్‌ తల్లిదండ్రులు ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అతను మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని నాగ్‌భిడ్‌ పట్టణంలో పెరిగాడు. ముంబైలోని బాంద్రాలో ఆర్‌డి నేషనల్‌ కాలేజ్‌లో చదివారు.

బాల్యంలో డ్యాన్సు నేర్చుకున్నాడు. దాంతో పాఠశాల స్థాయి నుంచి నృత్య ప్రదర్శనలో పాల్గొనేవాడు. ప్రిన్సిపాల్‌ ప్రోత్సాహంతో నాటికల్లో, థియేటర్‌ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చాడు. అతని డ్యాన్సు చూసి, అందరూ మెచ్చుకునేవారు. అప్పటి నుంచి కళారంగం వైపు కెరీర్‌ ప్రారంభించాడు. ఖాళీ సమయాల్లో విక్రాంత్‌ క్రికెట్‌, వీడియో గేమ్‌లు ఆడేవారు. మొదట టీవి షోస్‌లో పనిచేశారు. ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గా విక్రాంత్‌ మాస్సే హిందీ సినిమాలకు పరిచయం అయ్యాడు. విక్రాంత్‌ ‘ధూమ్‌ మచావో ధూమ్‌’ సినిమాలో మొదట నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘ధరమ్‌ వీర్‌, బాలికా వధు, ఖుబూల్‌ హై’ టీవి సీరియల్స్‌లో నటించాడు. ఆ తర్వాత ‘లూటేరా, దిల్‌ ధడక్నే దో, హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించి, మంచి గుర్తింపు సంపాదించారు.

‘ఎ డెత్‌ ఇన్‌ ది గంజ్‌’ లో విక్రాంత్‌ హీరోగా నటించారు. అదే అతని కెరీర్‌లో ఒక మలుపు తిరిగింది. వరుస అవకాశాలు వచ్చాయి. జీవిత చరిత్ర నేపథ్యంలో తీసిన ‘డ్రామా ఛపాక్‌ (2020)’, రొమాంటిక్‌ కామెడీ ‘డాలీ కిట్టి ఔర్‌ వో చమక్తే సితారే’, ‘మిస్టరీ థ్రిల్లర్‌ హసీన్‌ దిల్‌రుబా’, కుటుంబ నాటకం ‘రాంప్రసాద్‌ కి తెహ్వ్రి’, ‘రొమాంటిక్‌ హాటెల్‌రిల్‌’లో హీరోగా నటించారు. స్ట్రీమింగ్‌ సిరీస్‌ ‘మిర్జాపూర్‌, బ్రోకెన్‌ బట్‌ బ్యూటిఫుల్‌, క్రిమినల్‌ జస్టిస్‌’లలో కూడా విక్రాంత్‌ ముఖ్య ప్రాతల్లో నటించారు.

గత ఏడాది ’12th ఫెయిల్‌’ బయోగ్రాఫికల్‌ మూవీలో నటించారు. తాజాగా జరిగిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ -2024లో ఉత్తమ చిత్రంతో సహా ఐదు అవార్డులను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడిగా విధు వినోద్‌ చోప్రా, ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) విక్రాంత్‌ మాస్సే. ఉత్తమ ఎడిటింగ్‌, ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డులను గెలుచుకుంది. ఐపీఎస్‌ అధికారి మనోజ్‌కుమార్‌ శర్మ జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు. మనిషి వికాసానికి చదువు ఎంతో ముఖ్యం అని చెబుతూనే, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అనుకున్న లక్ష్యం చేరాలని చెప్పే సినిమా ఇది. కానీ విద్యారంగం పట్ల ప్రభుత్వాల అలసత్వం, అధికారమే పరమావధిగా సాగే రాజకీయాలు, కొందరు ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరి, తల్లిదండ్రుల అమాయకత్వం, పేదరికం వల్ల పిల్లలు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ ఒక్క చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. అందులో హీరో విక్రాంత్‌ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఐపీఎస్‌ అధికారి మనోజ్‌కుమార్‌ ఈ సినిమా చూసి, భావోద్వేగంతో విక్రాంత్‌ని హగ్‌ చేసుకున్నారు. ‘ఈ సినిమా చూసినంత సేపూ నీలో నన్నే చూసుకున్నాను. నేను ఏవిధంగా ఫీలయ్యానో.. అదే విధంగా నువ్వు అనుభూతి చెందావు. నా అసలైన హీరోవి నువ్వే’ అంటూ అతన్ని అభినందించారు. గత ఏడాదిలో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌ అందుకుంది. దాంతో అన్ని భాషల్లోనూ డబ్బింగ్‌ చేశారు. విక్రాంత్‌ మాస్సే తనతో పాటు ‘బ్రోకెన్‌ బట్‌ బ్యూటిఫుల్‌’ చిత్రంలో నటించిన శీతల్‌ ఠాకూర్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వీరికి గత ఏడాది ఒక బిడ్డ పుట్టింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే టీవీ షోస్‌లో, సీరియల్స్‌లో నటిస్తూ కెరీర్‌లో ముందుకు వెళుతున్నారు.

పేరు : విక్రాంత్‌ మాస్సే,

జననం : 3 ఏప్రిల్‌, 1987

నివాసం : ముంబై

చదువు : ఆర్ట్స్‌ అండ్‌ సైన్సు

వృత్తి : నటన

 

➡️