ఇడి చార్జిషీటులో ప్రియాంక గాంధీ పేరు ..

న్యూఢిల్లీ   :   కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ పేరు మొదటిసారి విచారణ సంస్థ చార్జిషీటులోకి ఎక్కింది. హర్యానాలో ఐదు ఎకరాల భూమి కొనుగోలు మరియు అమ్మకాల ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) చార్జీషీటులో పేరు నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. ఈ చార్జిషీటులో ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా పేరు కూడా ఉందని , అయితే ఎవరినీ నిందితులుగా పేర్కొనలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త సిసి.థంపి, భారత సంతతికి చెందిన బ్రిటన్‌ వ్యక్తి సుమిత్‌ చంద్రా పేరును కూడా చేర్చినట్లు తెలిపారు. అధికారిక రహస్యాల చట్టంతో పాటు ఇతర చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న, పరారీలో ఉన్న ఆయుధాల వ్యాపారి సంజయ్  భండారీ పేరును కూడా చేర్చినట్లు తెలుస్తోంది.

ప్రియాంక గాంధీ ఢిల్లీకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ హెచ్‌.ఎల్‌.పహ్వాతో ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు ఇడి ఆరోపిస్తోంది. పహ్వా ఫరీదాబాద్‌లోని తన వ్యవసాయ భూమిని 2006లో విక్రయించారని, నాలుగేళ్ల అనంతరం అదే భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అలాగే 2006 ఏప్రిల్‌లో ఫరీదాబాద్‌లోని అమీపూర్‌ గ్రామంలో ప్రియాంక గాంధీ పేరిట ఓ ఇంటిని కోనుగోలు చేశారని, ఆ భూమిని అదే సమయంలో పహ్వాకు తిరిగి విక్రయించారని పేర్కొన్నారు. రాబర్ట్‌ వాద్రా 2005, 2006 మధ్యకాలంలో అక్రమంగా అమిపూర్‌లో 40.8 ఎకరాల భూమిని పహ్వా మధ్యవర్తిత్వంతో కొనుగోలు చేసి, తిరిగి 2010 డిసెంబర్‌లో విక్రయించినట్లు ఇడి పేర్కొంది. బెయిల్‌పై విడుదలైన థంపి ద్వారా 2020లో 486 ఎకరాలకు ఇదే విధమైన ఒప్పందం జరిగిందని ఆరోపించింది.

ఈ ఆరోపణలపై గతంలో రాబర్ట్‌ వాద్రాని ఇడి విచారించిన సంగతి తెలిసిందే.  అయితే ప్రియాంక పేరుని చార్జిషీటులో నమోదు చేయడం మాత్రం ఇదే మొదటిసారి. ఈ అంశంపై ప్రియాంక గాంధీ స్పందించాల్సి వుంది.

పతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకునేందుకు ఇడి వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను బిజెపి వినియోగిస్తోందని కాంగ్రెస్‌ నేతలు ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు పలువురు నేతల పేర్లను ఇడి తన చార్జిషీట్‌లలో చేరుస్తుందని హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ను చూసి బిజెపి భయపడుతోందని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నానా పటోల్‌ మండిపడ్డారు. గతంలో గాంధీని చూసి బ్రిటీష్‌ ప్రభుత్వం భయపడిందని, ఇప్పుడు గాంధీ కుటుంబాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవా చేశారు. అసలు సమస్యల నుండి ప్రజలను మళ్లించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో బిజెపి కుట్రలు సృష్టిస్తోందని నాగ్‌పూర్‌ కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా అన్నారు.

➡️