ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ దారుణం

Feb 5,2024 11:27 #vizag steel

స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయివేటుపరం చేయడం దారుణమని స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు ఒవి.రావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు ఆదివారానికి 1039వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఒవి.రావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు ఆధునిక దేవాలయాలన్ని ఆనాటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అటువంటి పరిశ్రమలను నేటి ప్రధాని మోడీ కారుచౌకగా పెట్టుబడిదారులకు కట్టబెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బిజెపి కుట్రలు కార్మికుల ఐక్యత ముందు సాగవన్నారు. దీక్షల్లో యూనియన్‌ నాయకులు జి.శ్రీనివాసరావు, నమ్మి రమణ, ఎన్‌.కృష్ణ, యు.సోమేశ్‌, ఆర్‌ఎన్‌.ఆంజనేయులు, బి.ఆనంద్‌, ఆదిరెడ్డి శ్రీను, జి.సత్యనారాయణ, బి.సింహాచలం, అప్పలరాజు పాల్గొన్నారు.

➡️