ధరాఘాతం

Apr 10,2024 07:35 #RBI, #serve
  • దేశ వ్యాప్తంగా జనం విలవిల
  • భారీగా పెరుగుతున్న ఖర్చులు
  • పెరగని ఆదాయం
  •  ఆర్‌బిఐ కన్స్యూమర్‌ కాన్పిడెన్స్‌ సర్వే వెల్లడి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ధరలతో దేశవ్యాప్తంగా ప్రజానీకం సతమతమౌతున్నారు. పెరుగుతున్న ధరలకు తోడు ఆదాయం పెరగకపోవడం, ఖర్చులు గతంతో పోలిస్తే భారీగా పెరుగుతుండటంతో ప్రజల పరిస్థితి ఘోరంగా మారుతోంది. పెరుగుతున్న ధరలను అదుపులోకి తీసుకురావాల్సిన కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయమే పట్టకపోవడంతో భవిష్యత్తులోనూ ధరలు తగ్గుతాయని ప్రజలు భావించడం లేదు. ఈ సంవంత్సరమంతా ఇలాగే పెరుగుతాయని, వచ్చే ఏడాది కూడా పెరుగుదల కొనసాగుతుందని దేశ వ్యాప్తంగా అధికశాతం మంది ప్రజానీకం భావిస్తున్నారు. రానున్న సంవత్సరంలోనూ ఆదాయంలోనూ పెద్దగా మార్పు ఉండదని, అదే సమయంలో ఖర్చులు మరింతగా పెరుగకతప్పదన్నది అత్యధిక మంది అభిప్రాయం. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనూ పెరుగుదల అంతంతమాత్రమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందున్నది కూడా కష్టకాలమేనని దేశవ్యాప్తంగా అత్యధిక మంది నమ్ముతున్నారు. రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా తాజాగా విడుదల చేసిన కన్స్యూమర్‌ కాన్ఫిడెన్స్‌ సర్వే (సిసిఎస్‌)లో ఈ విషయాలు పేర్కొంది.
ధరలపై ఇలా…
ధరలు పైపైకే పోతున్నాయి. తాజా సర్వే ప్రకారం 89.2శాతం మంది ధరలు పెరగుతూనే ఉన్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాది ఇదే నెలలో చేసిన సర్వేలో 93.8శాతం మంది ధరలు పెరుగుతున్నాయన్న ఆందోళనను వ్యక్తం చేశారు. ఆ తరువాత వీరి సంఖ్య కొంత మేర తగ్గింది. అయినప్పటికీ, దేశ వ్యాప్తంగా 89శాతానికన్నా ఎక్కువమంది ధరాఘాతానికి గురవుతున్నారు. అంటే గత ఏడాదితో పోలిస్తే 4.6శాతం మందిమాత్రమే ధరలు పెరుగుదల విషయంలో తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఈ నామమాత్రపు తగ్గుదలనే మోడీ అనుకూల మీడియా భారీగా చూపిస్తోంది. ధరల విషయంలో ప్రజలు సానుకూలంగా ఉన్నారని ప్రచారం చేస్తోంది. తాజా సర్వే ప్రకారం రానున్న సంవత్సరంలో కూడా ధరలు పెరుగుతాయని 78శాతం మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చుక్కలు దాటిన నిత్యావసరాలు
నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు దాటుతున్నాయి. తాజా సర్వే ప్రకారం 84.5శాతం మంది నిత్యావసర వస్తువుల ధరలు పైపైకే పోతున్నాయని అభిప్రాయపడ్డారు. 13శాతం మంది నిత్యావసర వస్తువుల ధరలు నిలకడగా ఉన్నాయని, 2.5శాతం మంది తగ్గాయని అభిప్రాయపడ్డారు. రానున్న సంవత్సరంలోనూ వీటి ధరల పెరుగుదల కొనసాగుతుందని 82.5శాతం మంది అభిప్రయాపడ్డారు.
ఆరదోళనకరంగా ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణంపై కూడా దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. 77 శాతం మంది ద్రవ్యోల్భణం పెరుగుతోందన్న అందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్న అభిప్రాయాన్ని 76.7 శాతం మంది చెప్పారు. దీంతో రోజువారి వ్యవహారాల్లో తామే చేసే ఖర్చులు మరింత పెరుగుతాయన్న ఆందోళన ప్రజానీకంలో వ్యక్తమవుతోంది. తమ వ్యయం పెరిగిరదని 73 శాతం మందికిపైగా అభిప్రాయపడగా, వచ్చే ఏడాది కూడా వ్యయం పెరుగుతురదని 74 శాతం వరకు అభిప్రాయపడడం గమనార్హం.

➡️