అక్రమ గ్రావెల్ తవ్వకాలు అడ్డుకోండి

Feb 23,2024 22:38

ప్రజాశక్తి – మార్టూరు రూరల్
అనుమతి లేకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు నిర్వహిస్తున్న గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలంటూ బొబ్బేపల్లి సర్పంచ్ తాళ్లూరి లావణ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు తహాశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం వినతి పత్రం అందజేశారు. తమ గ్రామంలోని 387/సి 11సర్వే నంబర్లో ఉన్న 356ఎకరాల కొండ భూమిలో అధికార పార్టీ అండతో అనుమతి లేని ప్రాంతంలో చీరాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధికి చెందిన వ్యక్తులు అక్రమంగా తవ్వకాలు చేశారని ఆరోపించారు. గత వారం రోజులుగా మారిన రాజకీయ నేపథ్యంలో అదే గుత్తేదారులు తిరిగి కొండ మట్టి తవ్వకాలను తమ ఆధీనంలోకి తీసుకొని యథేచ్ఛగా తిరిగి తవ్వకాలు ప్రారంభించడంతో గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. బారీ వాహనాలు తిరిగి రోడ్లు ధ్వంసం కావడమే కాకుండా ఎర్ర మట్టి తరలిస్తున్న టిప్పర్ లారీలు ప్రమాదభరితంగా వెళుతుండటంతో ప్రజల ప్రాణాలకు భద్రతా లేకుండా పోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతి తీసుకున్న ప్రాంతంలో కాకుండా అనుమతి లేని ప్రాంతంలో విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు చేస్తూ పరిమితికి మించి గ్రావెల్‌ను తరలిస్తున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు లేవని పేర్కొన్నారు. పంచాయతీకి ఎలాంటి ఆదాయం లేని కొండ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని గతేడాది జూన్‌లోనే పంచాయతీ తీర్మానం చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రావెల్ అక్రమ తవ్వకాలను నిలిపి వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో రానున్న సాధారణ ఎన్నికలను తాము బహిష్కరిస్తామని హెచ్చరించారు. తహశీల్దారు కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు.

➡️