ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు : సిఇఒ రాజీవ్‌కుమార్‌

Jan 10,2024 21:50 #Election Commission, #Vijayawada
  • రాష్ట్రంలో 4.07 కోట్ల ఓటర్లు
  • పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువా
  • రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే క్రిమినల్‌ కేసులు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: ఈ ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికలను ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ పెద్దయెత్తున సన్నాహాలు చేస్తోందని భారత ప్రధాన ఎన్నికల కమిషనరు రాజీవ్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఇంకా ఏమేమి చేయాలనే అంశంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారి ఫిర్యాదులు, అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు. విజయవాడలోని ఓ హోటల్‌లో సాధారణ ఎన్నికలకు సంబంధించిన మొదటి సమావేశం నిర్వహించారు. మూడు రోజుల పర్యటనలో చివరిరోజు బుధవారం ఉదయం సిఇఒ, నోడల్‌ ఆఫీసర్లు, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌, రాష్ట్ర పోలీసులతో, అనంతరం సెంట్రల్‌, రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీస్‌, సాయంత్రం చీఫ్‌ సెక్రటరీ, డిజిపి, సెక్రటరీస్‌తో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌తో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని సిఇసి పేర్కొన్నారు. పురుష ఓటర్లు 1.99 కోట్ల మంది కాగా, మహిళా ఓటర్లు 2.07 కోట్ల మంది ఉన్నారన్నారు. ఓటు హక్కు ఎవరికైనా సరే రెండు చోట్ల ఉండకూడదన్నారు. రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే అటువంటి వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామన్నారు. తుది జాబితా విడుదల ముందు ఎక్కడైనా ఓటరుగా రిజిస్టర్‌ చేసుకోవచ్చన్నారు.ఎన్నికల్లో పెద్దయెత్తున ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నామని, రాజకీయ పార్టీల నుంచి ఓటర్ల చేర్పులు, తొలగింపులు, ఎన్నికల అధికారులు అవలంభిస్తున్న వైఖరి, కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని, గిరిజన ప్రాంతాల్లో ఎక్కడికక్కడే పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయాలని, వలంటీర్ల జోక్యం, సచివాలయ సిబ్బందిని బిఎల్‌ఒలుగా నియమించడం వంటి పలు అంశాలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఫిర్యాదులన్నిటినీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న 7.88 లక్షల ఓటర్లుఈ ఏడాది జరిగే ఎన్నికల్లో 18ా19 ఏళ్లకు పైబడిన యువత 7.88 లక్షల మంది తమ ఓటు హక్కును తొలిసారిగా వినియోగించుకోనున్నారని రాజీవ్‌కుమార్‌ తెలిపారు. గిరిజన ప్రాంతాలకు సంబంధించి 4,29,106 మంది ఓటర్లు కాగా, ఇందులో 18 ఏళ్లకు పైబడిన జనాబా 2,94,750 మంది ఉన్నారన్నారు. 46,185 పోలింగ్‌ కేంద్రాలురాష్ట్ర వ్యాప్తంగా 46,165 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో అర్బన్‌ 11,978, రూరల్‌లో 34,187 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 80 ఏళ్లు వయసు దాటిన ఓటర్లు 5.8 లక్షల మంది ఉన్నట్లు సిఇఒ వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఫిర్యాదులను పరిష్కరించేందుకు సి విజిల్‌ యాప్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు.ఓటర్‌ హెల్ప్‌లైన్‌ కోసం సువిధ పోర్టల్‌ఓటరు తమ ఓటును చేర్చుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో ఓటరుకు సువిధ పోర్టల్‌ అందుబాటులో ఉండనుంది. దీని ద్వారా తమ ఓటు ఎక్కడ ఉంది? ఏ పోలింగ్‌ పోలింగ్‌ బూత్‌లో నమోదైంది? వంటి సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనుంది. సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని సిఇసి రాజీవ్‌కుమార్‌ తెలిపారు.

➡️