చాంగ్‌-6 లూనార్‌ మిషన్‌కు చకచకా ఏర్పాట్లు

Jan 11,2024 09:30 #China, #Lunar Mission, #raket
  • ప్రయోగ వేదిక వద్దకు చేరుకున్న రోదసీ నౌక విడిభాగాలు

బీజింగ్‌ : ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో చాంగ్‌-6 లూనార్‌ మిషన్‌ను ప్రారంభించడానికి చైనా జాతీయ రోదసీ సంస్థ (సిఎన్‌ఎస్‌ఎ) సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకా చకా పూర్తవుతున్నాయి. అంతరిక్ష నౌక విడి భాగాలు సోమ, మంగళవారాల్లో రెండు రవాణా విమానాల్లో హైనన్‌ ప్రావిన్స్‌లోని వెన్‌చాంగ్‌ రోదసీ ప్రయోగ వేదిక వద్దకు చేరుకున్నాయని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. చంద్రునిపై అన్వేషణలో భాగంగా నాల్గో దశ కార్యక్రమాల్లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయని సిఎన్‌ఎస్‌ఎ పేర్కొంది. ప్రయోగ వేదిక వద్ద అన్ని సదుపాయాలు చక్కగా వున్నాయని, అనుకున్న ప్రణాళిక ప్రకారమే కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో చాంగ్‌-6ను ప్రయోగించనున్నట్లు సిఎన్‌ఎస్‌ఎ తెలిపింది. చంద్రుని తిరోగమన కక్ష్య రూపకల్పన, నియంత్రణలో కొత్త పుంతలు తొక్కాలన్నది చాంగ్‌-6 మిషన్‌ లక్ష్యంగా వుంది. చంద్రుని ఆవల వైపు నుండి నమూనాలు సేకరించడం, చంద్రుని ఉపరితలంపై దిగడం వంటి లక్ష్యాలు కూడా ఈ మిషన్‌లో వున్నాయి. రోదసీ నౌక చంద్రునిపై దిగే ప్రాంతం శాస్త్రీయ అన్వేషణ కూడా దీనితో పాటు కొనసాగుతుందని సిఎన్‌ఎస్‌ఎ తెలిపింది.

➡️