కోవిడ్‌పై వెంటనే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

Dec 27,2023 08:56 #cpm v srinivasarao, #press meet

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఒక మహిళ మరణించడం బాధాకరమని, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ కోవిడ్‌ కేసులు పెరగడంతో పాటు ఒక మరణం కూడా రికార్డు అయినట్లు వార్తలు వస్తున్నాయని, వెంటనే కోవిడ్‌పై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కోవిడ్‌ విజృంభించకుండా, వైరస్‌ సోకిన వారికి వైద్యం అందించడానికి అవసరమైన చర్యలు చేపట్టడం ప్రభుత్వ బాధ్యతని తెలిపారు. నూతన సంవత్సరాది, సంక్రాంతి పండగ వస్తున్న నేపథ్యంలో ఇది విజృంభించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. కోవిడ్‌ రెండో దశ విజృంభణ సమయంలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులు, తీవ్ర ప్రాణనష్టం తిరిగి ఎట్టి పరిస్థితుల్లో జరక్కుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు పారామెడికల్‌ సిబ్బందిని, అవసరమైన మందులను, ఐసియు, ఆక్సిజన్‌ బెడ్లను సమకూర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలను అప్రమత్తం చేసి కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు.

➡️