ప్రణయ్, అన్మోల్‌కు పగ్గాలు

Apr 5,2024 23:36 #Badminton, #Sports
  • థామస్‌, ఉబెర్‌ కప్‌లకు జట్ల ప్రకటన

న్యూఢిల్లీ: థామస్‌, ఉబెర్‌ కప్‌లకు జట్లను భారత బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌(బాయ్) శుక్రవారం ప్రకటించింది. పురుషుల జట్టుకు హెచ్‌ఎస్‌ ప్రణయ్, మహిళల జట్టుకు జాతీయ ఛాంపియన్‌ అన్మోల్‌ కర్బ్‌ సారథ్యం వహించనున్నారు. పివి సింధు పారిస్‌ ఒలింపిక్స్‌ సన్నాహాల్లో భాగంగా ఈ టోర్నమెంట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. గాయం కారణంగా ఆటకు దూరమై ఫిబ్రవరిలో ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్‌ ద్వారా పునరాగమనం చేసిన సింధు అప్పట్నుంచి ఆరు టోర్నీల్లో ఆడింది. ఒలింపిక్స్‌కు మరింత ఫిట్‌గా ఉండేందుకు సింధు ఉబెర్‌ కప్‌కు దూరమైందని బారు కార్యదర్శి సంజరు మిశ్రా తెలిపాడు. సింధు తప్పుకోవడంతో డబుల్స్‌ జోడీలు గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ, అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్టో కూడా టోర్నీ నుంచి వైదొలిగారు. సింధు గైర్హాజరీలో భారత్‌ పూర్తిస్థాయి జట్టు కాదని భావించిన ఈ రెండు జోడీలు టోర్నీకి దూరమయ్యాయి. థామస్‌ కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత పురుషుల బృందం పటిష్టమైన జట్టుతో బరిలో దిగుతోంది. ఈనెల 27న చెంగ్‌డులో థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ ప్రారంభం కానుంది.

థామస్‌ కప్‌…
సింగిల్స్‌: హెచ్‌.ఎస్‌.ప్రణరు, లక్ష్యసేన్‌, కిదాంబి శ్రీకాంత్‌, కిరణ్‌ జార్జ్‌, ప్రియాన్షు రజావత్‌..
డబుల్స్: సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి, అర్జున్‌-ధ్రువ్‌ కపిల

ఉబెర్‌ కప్‌..
సింగిల్స్‌: అన్మోల్‌ ఖర్బ్‌, తన్వీ శర్మ, అస్మిత చాలిహా, ఇషారాణి
డబుల్స్: శృతి మిశ్రా-ప్రియా కొంజేగ్హమ్‌, సిమ్రన్‌ సింఘీ-రితికా ఠాకూర్‌

థామస్‌కప్‌-2024 జట్లు: చైనా, డెన్మార్క్‌, ఇండోనేషియా, జపాన్‌, మలేషియా, ఇండియా, చైనీస్‌ తైపీ, కొరియా, థారులాండ్‌, కెనడా, హాంకాంగ్‌, జర్మనీ, ఇంగ్లండ్‌, చెక్‌రిపబ్లిక్‌, అల్జీరియా, ఆస్ట్రేలియా.

ఉబెర్‌కప్‌-2024 జట్లు: చైనా, కొరియా, జపాన్‌, థారులాండ్‌, ఇండోనేషియా, చైనీస్‌ తైపీ, ఇండియా, డెన్మార్క్‌, అమెరికా, మలేషియా, హాంకాంగ్‌, కెనడా, సింగపూర్‌, ఆస్ట్రేలియా, మెక్సికో, ఉగాండా.

➡️