ప్రభం’జనం’గా శంకర్‌ నామినేషన్‌

టిడిపి కూటమి తరపున శ్రీకాకుళం

శంకర్‌ నామినేషన్‌కు ర్యాలీగా వెళ్తున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు

హాజరైన ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

టిడిపి కూటమి తరపున శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి గురువారం గొండు శంకర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. నగరంలోని ఏడురోడ్ల కూడలి నుంచి వాంబే కాలనీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కళింగ రోడ్డు, పాతబస్టాండ్‌, జెడ్‌పి రోడ్డు, పాత శ్రీకాకుళం మీదుగా వాంబే కాలనీ వరకు ప్రత్యేక వాహనంలో ఎంపి కింజరాపు రామ్మోహన్‌ నాయుడుతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఏడు రోడ్ల కూడలి వద్ద జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి రామ్మోహన్‌ నాయుడు, అసెంబ్లీ అభ్యర్థిగా గొండు శంకర్‌ను పెద్దఎత్తున ప్రజలు ఓటువేసి భారీ మెజారిటీ అందించాలని కోరారు. జగన్మోహనరెడ్డి కాలం చెల్లిపోయిందని, కోడికత్తి, గులకరాయి డ్రామాలకు ఈ ఎన్నికలతో తెర పడనుందన్నారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమమని, వాటిని తాము చేసి చూసిస్తామన్నారు. సామాన్య కుటుంబ నేపథ్యం ఉన్న శంకర్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన అవసరముందని ఎంపీ పేర్కొన్నారు. శంకర్‌ను చూసి ప్రత్యర్థి ధర్మానకు భయం వెంటాడు తుందన్నారు. శ్రీకాకుళం అభివృద్ధి కోసం శంకర్‌ను గెలిపించాలన్నారు. శంకర్‌ మాట్లాడుతూ నియోజక వర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, శ్రీకాకుళం -ఆమదాలవలస రోడ్డు అయిదేళ్లయినా అధికారంలో ఉన్న మంత్రి ధర్మాన పూర్తి చేయలేక చేతులెత్తేసారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మత్యకారులకు జెట్టి కట్టించి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గార, శ్రీకాకుళం రూరల్‌ మండలాలు, నగర పరిధిలోని అన్ని డివిజన్‌ల నుంచి తరలివచ్చిన మహిళలు, యువత, విద్యార్థులు, టిడిపి, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఎంపి రామ్మోహన్‌ నాయుడుతో కలిసి తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రంగయ్యకు అందజేసారు. కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టరు దానేటి శ్రీథర్‌, కోరాడ సర్వేశ్వరరావు, బిజెపి నాయకులు పైడి వేణుగోపాలం, చల్లా వెంకటేశ్వరరావు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

 

➡️