పవర్‌ కట్‌

Apr 14,2024 13:30 #Sneha

నాన్న మీటింగు, కూతురి ఇన్‌స్టాగ్రాం రీల్స్‌, తమ్ముడి కంప్యూటర్‌ గేమ్స్‌, అమ్మ యూట్యూబ్‌ వీడియోస్‌కి చెప్పాపెట్టకుండా అడ్డుగోడ వేసి మాయమయింది కరెంటు. అబ్బా, ఛ, ఈ టైమ్‌లో ఏంటో, కర్మ రా బాబు, ఓ నో అని అంటూ పావుగంట సేపు అరుపులు, గోలలు. చిరాకుగా మొట్టమొదటిగా చీకటి గుహ నుండి బయటకు వచ్చింది కూతురు లత. ఆ తరువాత మెల్లగా, అమ్మ, నాన్న, తన బుడ్డి తమ్ముడు. నలుగురూ పక్కపక్కన నించోని, ఒకరి మొహాలు ఒకరు చూస్తూ, నెక్ట్స్‌ ఏం చెయ్యాలో తెలియక క్లూలెస్‌గా ఇంకో పావుగంట గడిపారు.

ఒక్క కొవ్వొత్తి కోసం వెతికే ప్రాసెస్‌లో అందరూ ఒకరి మీద ఒకరు అరిచేసుకుని, తొక్కేసుకుని, కొట్టేసుకున్నారు. ఏవిటో, ఈ ఇంట్లో ఎక్కడ ఏమున్నాయో ఏమీ దొరకవు, ఫోనులేమో ఛార్జింగులు ఉండవు అని విసుక్కుంది అమ్మ. యేయేయో, వే వే వే అని అమ్మకు వినపడకుండా వెక్కిరించింది లత. దోమలు కుట్టేస్తున్నాయే అమ్మ, అమ్మా నాకు ఆకలేస్తోందే, ఏవిటే కాస్త చూడు, నా ఫోన్‌ ఎక్కడ పెట్టేసాను కనపడట్లేదు… సరిపోయింది అందరూ నన్ను తినేయండి, అన్న అమ్మ అరుపుకి అందరూ బిక్క మొహాలు వేసి సైలెంట్‌ అయిపోయారు. ఉక్కకి చిరాకేసి, తమ్ముడు కిటికీ తలుపు తీసాడు. ఒక్కసారి వెన్నెల కాంతులు, పిల్లగాలులతో కలసి వచ్చి అందరి విసుగును మాయగొట్టేసి, నవ్వులకు నీళ్ళు పోసి, బుజ్జి నవ్వు మొగ్గలు పూయించింది.

కిటికీలోంచి వచ్చే వెలుగుతో ఆడుకుంటూ, తమ్ముడు హేరు ఇలా చూడండి, నేను నా చేతుల్తో గోడ మీద, మియావ్‌ మియావ్‌ పిల్లి షేప్‌ నీడను చేసా అన్నాడు. దానికి అక్క, ఏడిసావ్‌ అది బెక్‌ బెక్‌ కప్పలా ఉంది, ఇదిగో నాది చూడు ఎలా ఉందో అంటూ తానూ మొదలుపెట్టింది. అమ్మ ఇద్దరినీ చూసి నవ్వుకుంది. అప్పుడు నాన్న, అసలు అవన్నీ కాదు, నన్ను చూడండి, సింహాన్ని చేశాను, అంటూ ఇంకా రకరకాలు నీడలు చేసి చూపిస్తూ పిల్లల్ని ఆశ్చర్యపరిచాడు. ఎప్పుడూ లేనంతసేపు, ఎప్పుడూ లేనన్ని కబుర్లన్నీ చెప్పేసుకున్నారు ఆ కాసేపు, నవ్వుకుంటూ అందరూ.

ఇంతలో అమ్మ, అన్నట్టు కొవ్వత్తి వంటగదిలో ఆ గాజు కప్పుల పక్కన ఉన్నట్టు గుర్తే లత, ఒకసారి వెళ్లి చూడు, అంది. లత వెళ్లి అంతా తడుముతూ వెతికితే, ఏదో కొవ్వత్తిలాగ తగలగానే, వెంటనే దాన్ని ఇంకెప్పుడూ అందనంత వెనక్కీ చివ్వరకీ తోసేసి, అటు ఇటు చూసి బయటకి వచ్చి, ‘లేదమ్మా ఏమీ దొరకలేదు’ అంది. ‘ పోనీలే ఇంకాసేపు ఇలానే ఉందాం, ఇలా హాయిగా’. అని చెప్పి, మళ్లీ వెళ్లి ఇంకెన్నో ఎన్నెన్నో చాలా చాలా కబురులు చెప్తూ కూర్చుంది, ఆరోజు ఆ దొంగ లత…

ఎండలో జాగ్రత్త!
హలో డియర్‌ ఫ్రెండ్స్‌ నా పేరు శౌర్య. మీరంతా బాగున్నారా? వేసవికాలం వచ్చేసింది కదా! ఈ సంవత్సరం ఇప్పటికే ఎండలు బాగా ఉన్నాయి. ఇంకా పెరుగుతాయట. పిల్లలమయిన మనం ఎండల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలట! నన్ను కొన్ని జాగ్రత్తలు తీసుకోమని మా తాతయ్య చెప్పారు. మీరు కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటారని మీకు కూడా చెప్తున్నా.
లూజుగా ఉండే దుస్తులు వేసుకోమన్నారు. వీలయినంత వరకూ కాటన్‌ డ్రెస్‌లే వేసుకోవాలట. బయటకు వెళ్లేటప్పుడు నల్ల అద్దాల కళ్లజోడు పెట్టుకోవాలి. మంచి నీరు, వీలయితే కొబ్బరి నీళ్లు బాగా తాగాలని చెప్పారు. ఎప్పుడూ ఒక నిండు బాటిల్‌ నీళ్లు దగ్గరుంచుకోవాలట. బయటకు వెళ్లి వచ్చినప్పుడు తప్పకుండా స్నానం చేయాలి. ఈ వేసవిలో రెండుపూటలా స్నానం చేస్తేనే హాయిగా ఉంటుందంటున్నారు తాతయ్య. ఫ్రిజ్‌ లోని నీళ్లు కాకుండా మామూలు నీరు తాగమన్నారు. కూల్‌డ్రింక్స్‌ తాగొద్దన్నారు. డీప్‌ ఫ్రై చేసిన పదార్థాలు ఏవీ తినకుండా ఉంటే మంచిదన్నారు. నేను అలానే చేస్తున్నాను. మీరు కూడా అలానే చేయండి. ఇక ఉంటానే. మరి ఎండాకాలంలో మీరు ఎలా గడుపుతున్నారో నాకూ చెప్పండి ఫ్రెండ్స్‌..!

– శౌర్యా , 2వ తరగతి,
వెటరన్స్‌ హిల్‌ ఎలిమెంటరీ స్కూలు,
ఆస్టిన్‌, టెక్సాస్‌ స్టేట్‌, అమెరికా.

– కమరగిరి సుదీప్తి,
ఎల్‌కెజి,
ఎస్‌ఎస్‌వి ఇంగ్లీషుమీడియం స్కూలు,
11వ వార్డు, ఎన్టీఆర్‌ నగర్‌,
నెల్లూరు.

➡️