పోటెత్తిన విఎఓలు

Jan 31,2024 10:13 #MLC KS Lakshmana Rao, #Protest, #VAO
  • 36 గంటల మహాధర్నా ప్రారంభం
  • మూడేళ్ల కాలపరిమితి రద్దుచేయాలి : కెఎస్‌ లక్ష్మణరావు డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన 36 గంటల మహాధర్నాకు విఎఓలు పోటెత్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి భారీ సంఖ్యలో తరలిరావడంతో విజయదాడ ధర్నా చౌక్‌ కిక్కిరిసిపోయింది. సిఐటియు అనుబంద సంఘం అయిన ఎపి వెలుగు విఓఎ (యానిమేటర్స్‌) ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాను పిడిఎఫ్‌ ఎంఎంల్‌సి కె.ఎస్‌.లక్ష్మణరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలను సమర్థవంతంగా పనిచేసేలా అహర్నిశలు కృషిచేస్తున్న విఓఎలకు మూడేళ్ల కాలపరిమితి ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా వారి సభలను జయప్రదం చేసేందుకు డ్వాక్రామహిళలను తరలించడం రివాజుగా మారిందన్నారు.. పిడిఎఫ్‌ ఆధ్వర్యంలో అధికారుల దృష్టికి తీసుకెల్తే అసలు విఓఎలు ప్రభుత్వానికి సంబందంలేదని స్వయం సహాయక సంఘాలు పెట్టుకున్నవారని అధికారులు చెబుతున్నారని, అదే నిజమైతే మూడు సంవత్సరాల కాలపరిమితి ఉత్తర్వులను ప్రభుత్వం ఎలా విడుదల చేసిందని ఆయన ప్రశ్నించారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగ్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు, కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో విఓఎలు ఎంతోమంది మహిళలను నాయకులుగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారని అన్నారు. పెట్టుబడిదారులకు రూ 12లక్షల కోట్లు రుణాలను మాఫిచేసిన పాలకులకు చిరుద్యోగులకు కనీసవేతనాలను అమలు చేసేందుకు ముందుకు రావడంలేదని విమర్శించారు. ఐదేళ్ల క్రితం మన ప్రభుత్వం వస్తుందని, మీ సమస్యలన్నింటికి పరిష్కారం చూపుతానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. నాలుగేళ్లు ఎదురు చూసినా పట్టించుకోనందునే ఇపుడు రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. మఈ కార్యక్రమంలో వెలుగు విఓఎ(యానిమేటర్స్‌) ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడారు. విఓఎలకు కాలపరిమితి ఉత్తర్వులను రద్దు చేయాలని, ప్రతి ఒక్కరికి పదిలక్షల రూపాయల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ కల్పించాలని, రాజకీయ వేదింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ప్రధానకార్యదర్శి డి రమాదేవి, యానిమేటర్స్‌ అసంఘం నాయకులు సిహెచ్‌ రూపాదేవి, సిఐటియు నాయకులు సీతారాములు, నర్సింహరావు తదితరులు మాట్లాడారు. అఖిల పక్షపార్టీల సంఘీభావం వెలుగు యానిమేటర్స్‌ సమస్యలను పరిష్కరించాలని విజయవాడలోని ధర్నా చౌక్‌లో విఓఎలు చేపట్టిన 36 గంటల దీక్షలకు అఖిలపార్టీల సంఘాల నాయకులు కలిసి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, పిసిసి వర్కింగ్‌ ప్రసిడెంట్‌ సుంకర పద్మశ్రీ, ఆమ్‌ఆద్మి పార్టీ నాయకులు ఫణిరాజు, ప్రత్యేక హోదా సాదన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌ తదితరులు మద్దతును తెలిపారు. పొదుపు సంఘాల అభివృద్దికి విశేషంగా కృషి చేస్తున్న విఓఎలను అకారణంగా తొలగించేలా వున్న ఉత్తర్వులను రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఈ సందర్బంగా డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడేళ్ల కాలపరిమితి జీఓను రద్దు చేస్తామని ఈ సందర్బంగా వర్లరామయ్య హామి ఇచ్చారు.

➡️